పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఢిల్లీలో నిర్వహించిన జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే.. లోక్‌సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఢిల్లీలో నిర్వహించిన జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. జీ20 సదస్సు విజయవంతం అయినందుకు దేశంలోని ప్రతి ఒక్కరి గర్వంగా ఉందని అన్నారు. వసుదైక కుటుంబం థీమ్‌తో జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. జీ 20 సదస్సు విజయవంతం చేసినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. జీ20 సదస్సు విజయవంతం కావడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'దార్శనికత' నాయకత్వాన్ని స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు.
ప్రధాని మోదీ దార్శనికత, మార్గదర్శకత్వం జీ20 నాయకులు జారీ చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో సున్నితమైన అంశాలపై కూడా ఏకాభిప్రాయానికి దారితీసిందని చెప్పారు. జీ20 సమ్మిట్ సందర్భంగా భారతదేశం ప్రపంచంలో శాంతి, సంయమనం వాయిస్‌గా ఉద్భవించిందని అన్నారు. జీ20 సదస్సు వల్ల మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసిందని అన్నారు. గ్లోబల్ ఆఫ్ ది సౌత్ వాయిస్‌ను భారత్ బలంగా వినిపించిందని చెప్పారు. భారత్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు విప్లవాత్మక చర్య అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. భారత్ చేపట్టిన మూన్ మిషన్ విజయవంతం అయిందని.. చంద్రయాన్-3 మన తిరంగను ఎగురవేసిందని, శివశక్తి పాయింట్ ఒక కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోందని అన్నారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించాలని ప్రధాని మోదీ చెప్పారు. జీ20 సదస్సు సందర్భంగా మనం గ్లోబల్ సౌత్ వాయిస్‌గా మారినందుకు, ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారతదేశం ఎల్లప్పుడూ గర్విస్తుందని తెలిపారు. ఇదంతా భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని పేర్కొన్నారు. 'యశోభూమి' అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కూడా నిన్న దేశానికి అంకితం చేయబడిందని మోదీ చెప్పారు.
ఈ పార్లమెంటు సమావేశాలు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ.. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా మోదీ తెలిపారు. రేపు గణేష్ చతుర్థి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనానికి తరలివెళ్తామని చెప్పారు. వినాయకుడిని 'విఘ్నహర్త' అని కూడా అంటారని.. ఇప్పుడు దేశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు తక్కువ వ్యవధి ఉండవచ్చని.. కానీ ఇది చరిత్రాత్మకంగా నిలవనున్నట్టుగా చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోందని చెప్పారు. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.