
పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. పార్లమెంట్ వర్షకాల సమావేశాల మూడో రోజైన బుధవారం.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, జీఎస్‌టీ పెంపునకు వ్యతిరేకంగా పలు ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఈ నిరసన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు, ఎన్సీపీ ఎంపీలు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్, పాల ప్యాకెట్లు, ఇతర నిత్యావసరాలను నెలపై ఉంచి నిరసనకు దిగారు. ధరల పెంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే ఈ నిరసనల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఈ నిరసనల్లో కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ వేదిక పంచుకుంది. నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పక్కనే టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఉన్నారు. అయితే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయించేందుకు మమతా నిర్ణయించిన సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం ఇష్టంలేకనే తమ పార్టీ ఈ సమావేశానికి వెళ్లలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత శరద్ పవార్ చెప్పడంతో.. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది. అయితే ఇప్పుడు విపక్షాల నిరనల్లో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు.. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగానే చెప్పాలి.
మరోవైపు వర్షాకాల సమావేశాల్లో భాగంగా మూడో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాల నిరసనలు, అంతరాయాల మధ్య ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో విపక్ష సభ్యుల నిరసన నేపథ్యంలో.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ‘‘చర్చల్లో పాల్గొనాలని నినాదాలు చేస్తున్న సభ్యులకు నేను చెప్పాలనుకుంటున్నాను. పార్లమెంటు పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
ద్రవ్యోల్బణంపై ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో వరుసగా మూడో రోజు రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. గందరగోళం మధ్యలోనే కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడటం ప్రారంభించిన కొద్దిసేపటికే.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.