
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో సమావేశాలు ప్రారంభం కాగానే.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఇటీవల లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. ఇటీవల ఎన్నికైనా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశాల ప్రారంభానికి ముందు.. పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అందుబాటులో ఉన్న ముఖ్యమైన మంత్రులతో సమావేశమయ్యారు. ఇక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల విజయవంతంగా సాగేందుకు సహకరించాలని ఎంపీలను ప్రధాని మోదీ కోరారు.
లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే.. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ నిమిత్తం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.
ఇక, ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సాగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో అగ్నిపథ్ పథకం, ధరల పెరుగుదల, ‘‘అన్‌పార్లమెంటరీ’’ పదాల జాబితా.. వంటి అంశాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. మరోవైపు విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సిద్దమైంది. ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రెండు సభల్లో ప్రెజెంటేషన్ కోసం వివిధ శాఖలు 32 బిల్లులను సూచించాయని.. వాటిలో 14 సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ పార్లమెంటు సమావేశాల్లో 32 బిల్లులు సమర్పించడానికి వివిధ శాఖలు సూచించాయి. వాటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నాయి, అయితే మేము చర్చ లేకుండా బిల్లులను ఆమోదించం’’ అని చెప్పారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాల డిమాండ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘పార్లమెంటు నియమాలు, విధానాల ప్రకారం అన్ని అంశాలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
‘‘ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్, దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి 13 అంశాలను అఖిలపక్ష సమావేశంలో మేం లేవనెత్తాం’’ అని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. 14 రోజుల్లో 32 బిల్లులు ఎలా ఆమోదం పొందుతాయని ప్రశ్నించారు.