నల్ల దుస్తుల్లో పార్లమెంట్‌కు కాంగ్రెస్ ఎంపీలు.. ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడిన ఉభయ సభలు..

By Sumanth KanukulaFirst Published Mar 27, 2023, 11:22 AM IST
Highlights

పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు ఉదయం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి.  ప్రతిపక్ష ఎంపీల నిరసన నేపథ్యంలో లోక్‌సభ సాయంత్రం  4 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. 

పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు ఉదయం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీల నిరసన తెలిపారు. అదానీ గ్రూప్ సమస్య, రాహుల్ గాంధీ అనర్హతపై వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే లోక్‌సభ సాయంత్రం  4 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు, పలువురు విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. 

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాహుల్‌పై అనర్హత వేటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక, పార్లమెంట్ సమావేశాలకు ముందు.. పార్లమెంటు భవనంలోని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష నేతల వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు 17 పార్టీలు హాజరయ్యాయి. 

ఈ సమావేశానికి హాజరైన పార్టీలలో.. కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్,  ఎస్పీ, ఎన్‌సీపీ, కేరళ కాంగ్రెస్‌, ఎండీఎంకే, ఐయూఎంఎల్, టీఎంసీ, ఆర్‌ఎస్‌పీ, ఆప్, జమ్మూ కశ్మీర్ ఎన్‌సీ, ఉద్దవ్ వర్గం  శివసేన హాజరయ్యాయి. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు టీఎంసీ పాల్గొనలేదు. అయితే ఈరోజు జరిగిన సమావేశానికి టీఎంసీ కూడా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌పై అనర్హత వేటును టీఎంసీ కూడా ఖండించిన సంగతి తెలిసిందే. ఇక, పార్లమెంట్‌లోని సీపీపీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

click me!