
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. నేరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్న ప్రస్తుత తరుణంలో కూతుళ్ల పట్ల మరీ జాగ్రత్తగా ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ, ఏది శృతి మించిన ముప్పే. అతి జాగ్రత్తగా ఉండాల్సిన తల్లిదండ్రులు కన్నవారిపైనే అనుమానాలు, ఆందోళనలకు గురైతే పిల్లలను ఎలా గైడ్ చేయగలరు. అందుకే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఐదో తరగతి చదివే అమ్మాయి తల్లిదండ్రులు తప్పటడుగు వేశారు. అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడుతున్నదని అభం శుభం తెలియని ఐదో తరగతి బాలికను చంపే ప్రయత్నం చేశారు.
తమ కూతురు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, మూడు రోజుల తర్వాత ఆ పోలీసులకు తల్లిదండ్రుల మీదే అనుమానం వచ్చింది. వారినే గట్టిగా అడిగారు. ఆదివారం వారిని అరెస్టు చేశారు. చేసిన నేరాన్ని ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.
ఆ దంపతులు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. తమ కూతురు ఎక్కువ మంది అబ్బాయిలతో మాట్లాడటం, అసభ్యకరంగా సంజ్ఞలు చేయడం తాము గమనించామని, ఇది తమలో కోపాన్ని తీవ్రంగా పెంచిందని ఆ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్టు వారు వివరించారు. అందుకే తమ కూతురిని కెనాల్‌లో తోసేసినట్టు చెప్పారు.
ఆ అమ్మాయి ఇంకా లభించలేదు.
ఈ నెల 1వ తేదీన బబ్లూ, ఆయన భార్య రూబీలు పోలీసులకు ఓ ఫిర్యాదు అందించారు. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని ఎస్పీ కేశవ్ కుమార్ తెలిపారు. వారి కూతురు ఐదో తరగతి చదువుతున్నదని వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం, ఆ తల్లిదండ్రులను అరెస్టు చేసినట్టు ఆ పోలీసు అధికారి తెలిపారు.
ఆ తల్లిదండ్రులు వారి కూతురిని కెనాల్‌లో తోసేసినట్టు చెప్పారని ఎస్పీ వివరించారు. వారు అందించిన సమాచారం ఆధారంగా అమ్మాయి కోసం గాలింపులు జరుపుతున్నామని తెలిపారు.