
తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకేలో (AIADMK) ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాజీ సీఎంలు పన్నీర్‌సెల్వం (panneerselvam), ఎడప్పాడి పళనిస్వామి (palaniswami) వర్గాల మధ్య వివాదం చెలరేగింది. పార్టీలో ఏక నాయకత్వాన్ని కోరుకుంటోన్న పళనిస్వామికి సీనియర్ నేతలు మద్దతు తెలపడాన్ని పన్నీర్‌సెల్వం వర్గం వ్యతిరేకించింది. ఇదే సమయంలో వేదికపైకి చేరుకున్న పన్నీర్‌సెల్వంపైకి పళని మద్దతుదారులు వాటర్ బాటిళ్లతో దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో భద్రతా సిబ్బందిని ఆయనను బయటకు తీసుకెళ్లారు. అయితే, పళనిస్వామి తిపాదించిన ఏక నాయకత్వంపై జనరల్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని.. కేవలం ముందస్తుగా నిర్ణయించిన తీర్మానాలనే ఆమోదించాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించిన కొన్ని గంటలకే పార్టీ సమావేశంలో గొడవ జరగడం గమనార్హం.
గతంలో ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించేందుకు అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం భేటీ అయ్యింది. ఇదే సమయంలో పళని, పన్వీర్ సెల్వంలు తమ మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల నినాదాలు, కేకల మధ్యే తీర్మానాలను చదవడం మొదలుపెట్టారు. అయితే, ఈ తీర్మానాలన్నింటినీ జనరల్ కౌన్సిల్ తోసిపుచ్చుతోందంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం ప్రకటించారు. మరో సీనియర్ కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. తీర్మానాలన్నింటినీ సభ్యులు తిరస్కరించారని.. ఏక నాయకత్వమే వారి ప్రధాన డిమాండ్ అని ప్రకటించారు.
జయలలిత (jayalalitha) మరణం తర్వాత అన్నాడీఎంకే నాయకత్వం విషయంలో పార్టీలో విభేదాలు రచ్చెకెక్కాయి. ముఖ్యంగా పార్టీలో ఏక నాయకత్వాన్ని సమర్థిస్తోన్న పళనిస్వామి.. పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యేందుకు గతకొన్ని రోజులుగా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు పన్నీర్‌సెల్వం మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి ఉద్దండులతో పనిచేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పన్నీరు సెల్వం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న ద్వంద్వ నాయకత్వాన్నే కొనసాగించాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. అయితే గురువారం జరిగిన సమావేశంలో ఏక నాయకత్వం అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడంతో పన్నీర్ సెల్వం వర్గం మండిపడింది. ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.