పాకిస్థాన్ చర్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఆందోళన వ్యక్తం చేసారు. పాక్ బలగాలు భారత్ వైపు కదులుతున్నాయని ఆమె తెలిపారు.
India Pakistan War : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య పరస్పర మిస్సైల్, డ్రోన్ దాడులు జరుగుతుండగా ఇది మరింత ముదిరేలా ఉంది. ఇప్పటికే భారత్ లోని సైనిక స్థావరాలు, సామాన్యుల నివాస ప్రాంతాలే టార్గెట్ గా దాడులకు దిగిన పాక్ ఇప్పుడు సైనిక చర్యకు సిద్దమవుతోందా? అంటే అవుననే అంటేన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.
. ఈ యుద్దవాతావరణం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ పాల్గొని తాజా పరిణామాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా వ్యోమికా సింగ్ మాట్లాడుతూ... పాకిస్థాన్ దళాలు ముందుకు కదులుతున్నాయని అన్నారు. అంటే భారత్ పై దాడిచేసే ఉద్దేశంతో పాకిస్థాన్ ఉన్నట్లు అర్థమవుతోందని... అందుకే భారత సైన్యం కూడా అలర్ట్ గా ఉందని అన్నారు. భారత భూభాగంలోకి అడుగుపెడితే పాక్ సేనలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అన్ని దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికైనా పాకిస్తాన్ సంయమనం పాటిస్తే ఉద్రిక్తత తగ్గించడానికి భారతదేశం కట్టుబడి ఉందని వింగ్ కమాండర్ సింగ్ నొక్కి చెప్పారు.
"పాకిస్తాన్ సైన్యం తన దళాలను ముందు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గమనించాం. ఉద్రిక్తతను మరింత పెంచే దాడి ఉద్దేశాన్ని సూచిస్తుంది. భారత సాయుధ దళాలు అధిక స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. అన్ని దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని ధీటుగా జవాబు ఇస్తున్నాం. పాకిస్తాన్ కూడా సంయమనం పాటిస్తే తప్ప ఉద్రిక్తత తగ్గించడానికి భారత సాయుధ దళాలు సహకరిస్తాయి'' అని వ్యోమికా సింగ్ స్పష్టం చేసారు.
ఇప్పటికీ భారత సాయుధ దళాలు గుర్తించబడిన సైనిక లక్ష్యాలను మాత్రమే భారత్ ధ్వంసం చేస్తోంది... సామాన్య ప్రజల జోలికి వెళ్లడంలేదని తెలిపారు. కానీ పాకిస్థాన్ సామాన్య పౌరులను కూడా టార్గెట్ చేసిందన్నారు.
ఇక భారత S-400 వ్యవస్థ నాశనమైందని... సూరత్‌గఢ్ మరియు సిర్సాలోని విమానాశ్రయాలను ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని అన్నారు. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను భారతదేశం స్పష్టంగా తిరస్కరిస్తోందని వ్యోమికా సింగ్ అన్నారు.
శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రయోగించిన బైకర్ YIHA III కమికేజ్ డ్రోన్‌లు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని పలు పౌర ప్రాంతాలపై దాడులు జరిగాయి, వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ఉదయం 5 గంటలకు భారత సైన్యం వైమానిక డిఫెన్స్ సిస్టం ద్వారా ఈ ప్రయత్నాన్ని విఫలం చేశారు... డ్రోన్‌లను గాలిలోనే నాశనం చేశారని తెలిపారు.,