
TRS protest in New Delhi: తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందేనని టీఆర్ ఎస్ పార్టీ ఛలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు. సోమవారం ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి భారతీయ కిసాన్ యూనియన్ (BKU )జాతీయ ప్రతినిధి, రైతుసంఘం నేత రాకేష్ టికాయత్ మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందనీ, దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తులన్నింటికీ కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేం అన్ని విధాలా సహకరిస్తాం అని రాకేష్ టికాయత్ తెలిపారు.
నిరసనలో భాగంగా చనిపోయిన రైతులకు కేంద్రం ₹ 25 లక్షల నష్టపరిహారం చెలించాలని రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఆయన అన్నారు.
దేశమంతా ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతుబంధు భేష్. అది దేశానికే ఆదర్శమని రాకేష్ టికాయత్ కొనియాడారు. తెలంగాణా తరహాలో అన్ని రాష్ట్రాల్లో రైతుబంధును అమలుచేయాలి. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు అందించాలి.
ఉచిత కరెంటు విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అభినందనీయని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో తలపెట్టే ఏ కార్యక్రమానికైనా మా మద్దతు ఉంటుందని కిసాన్ నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు.