
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ (congress) నిరసన సందర్భంగా పోలీసులు నెట్టివేయడంతో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం (p chidambaram) ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యిందని మరో నేత రణదీప్ సూర్జేవాలా (randeep surjewala) ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (rahul gandhi) ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రాహుల్ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) కార్యాలయం వద్ద వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. వీరిలో చిదంబరం కూడా వున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు చిదంబరాన్ని బలంగా పక్కకు నెట్టడంతో ఆయన పక్కటెముకలు విరిగిపోయినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
‘‘ మోడీ ప్రభుత్వ అనాగరికత మరోసారి హద్దులు దాటింది. మాజీ హోంమంత్రి పీ.చిదంబరంపై పోలీసులు చేయి చేసుకున్నారు.. ఆయన అద్దాలు నేలపై విసిరికొట్టారు. అతని ఎడమ పక్కటెముకలు విరిగిపోయాయి. ఎంపీ ప్రమోద్ తివారీని సైతం రోడ్డుపై పడేశారు. అతని తలకు గాయం అవ్వడంతో పాటు.. పక్కటెముక ఫ్రాక్చర్ అయ్యింది. ఇది ప్రజాస్వామ్యామా’’ అంటూ రణదీప్ సూర్జేవాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ వెంట చిదంబరంతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తదితరులు వున్నారు.
మరోవైపు ఈ విషయాన్ని స్వయంగా చిదంబరం ధ్రువీకరించారు. తనపైకి ముగ్గురు పోలీసులు దూసుకొచ్చారని.. ఆ దాడిలో స్వల్ప గాయాలతో బయటపడినందుకు డాక్టర్లు తనను అదృష్టవంతులు అన్నారని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను బాగానే వున్నానని.. రేపు యథావిధిగా విధులకు హాజరవుతానని చిదంబరం పేర్కొన్నారు.