ఫోన్ చేస్తే చాలు... ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ హోం డెలివరీ: కేజ్రీవాల్ వినూత్న ప్రయోగం

By Siva KodatiFirst Published May 15, 2021, 5:14 PM IST
Highlights

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం ఢిల్లీ. బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ అందక ఇక్కడి ప్రజలు దారుణ పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా పరిస్ధితిలో ఎలాంటి మార్పు రాలేదు

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం ఢిల్లీ. బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ అందక ఇక్కడి ప్రజలు దారుణ పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా పరిస్ధితిలో ఎలాంటి మార్పు రాలేదు.

ముఖ్యంగా ఆక్సిజన్  సంక్షోభం కారణంగా జనం పిట్టల్లా రాలారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ను కొట్టేసిందన్న ఆరోపణల్ని సైతం ఢిల్లీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఢిల్లీ ప్రభుత్వం ప్రాణాల్ని నిలబెడుతోంది.

ఇదే సమయంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా శనివారం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను తట్టుకొని నిలిచేందుకు గాను ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Also Read:గుడ్ న్యూస్ : దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు...

అలాగే హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటివద్దకే డెలివరీ చేయించుకునే వెసులుబాటును కల్పించింది.  ఒక్కోబ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయని.. ఆసుపత్రుల్లో కోలుకొని వచ్చినవారికి కూడా ఒక్కోసారి ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితి వస్తోందని కేజ్రీవాల్ అన్నారు.

అలాంటి వారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే.. వైద్యులు ఎప్పటికప్పుడు బాధితులను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే..తక్షణం స్పందిస్తామని సీఎం ప్రజలకు భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్ధితుల్లో సహాయం కోసం 1031 నంబర్‌కు కాల్ చేయాలని కేజ్రీవాల్ సూచించారు.

కాగా గత కొన్నిరోజులుగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం 6,500 మందికి పాజిటివ్‌గా తేలిందని.. ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభించదని ఆశిస్తున్నామన్నారు. 

click me!