పండుగల వేళ ప్రమాదాలు.. రెండు యాక్సిడెంట్‌లలో 31 మంది దుర్మరణం.. 30 మందికి గాయాలు

By Mahesh KFirst Published Oct 2, 2022, 1:03 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 31 మంది మరణించారు. కనీసం 30 మంది గాయపడ్డారు. నిన్న రాత్రి కాన్పూర్‌లో ఈ ఘటనలు జరిగాయి.
 

లక్నో: పండుగల వేళ ప్రయాణాలు పుంజుకుంటాయి. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా.. ట్రాఫిక్ సమస్యలు, అదే విధంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నట్టు అర్థం అవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిన్న రాత్రి గంటల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 31 మంది దుర్మరణం చెందారు. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మొదటి యాక్సిడెంట్ ఘాతంపూర్ ఏరియాలో జరిగింది. ఉన్నావ్‌లోని చంద్రికా దేవి టెంపుల్‌లో పూజలు చేసుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సుమారు 50 మంది భక్తులతో ఓ ట్రాక్టర్ ట్రాలీ వెళ్లుతున్నది. ఈ ట్రాక్టర్ ట్రాలీ ఘాతంపూర్ ఏరియా వద్దకు రాగానే అది ఓ కొలనులో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉండటం బాధాకరం. కాగా, మరో 20 మంది వరకు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను సమీప స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పాట్ రాలేదని, ఈ నిర్లక్ష్యం కారణంగా సార్హ్ పోలీసు స్టేషన్ ఇంచార్జీని సస్పెండ్ చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. 

కాగా, రెండో యాక్సిడెంట్ ఘటన అహిర్వాన్ ఫ్లై ఓవర్ దగ్గర చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్ లోడర్ టెంపోను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు. మరో పది మంది వరకు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని హాస్పిటల్‌లో చికిత్స కోసం అడ్మిట్ చేసినట్టు చెప్పారు.  

ట్రక్ కోసం గాలింపులు జరుపుతున్నట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆనంద్ ప్రకాశ్ తివారీ వివరించారు. 

ట్రాక్టర్ ట్రాలీలో కొలనులో పడి 26 మంది మరణించిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సంఘీభావం తెలిపారు.

click me!