
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో గూండాల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. సుమారు 20 రోజుల్లోనే 13 వేల మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 18 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13వేల మంది గూండాలను అరెస్టు చేసినట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తుల పీచమణచడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగానే ఈ అరెస్టులు అని తెలిపారు. కేరళలో ఇటీవలే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. గతేడాది డిసెంబర్‌లో అలప్పుజాలో ఎస్‌డీపీఐ, బీజేపీ నేతల వరుస హత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ హత్యల నేపథ్యంలోనే రౌడీల అరెస్టులకు రాష్ట్ర పోలీసు చీఫ్ అనిల్ కాంత్ ఆదేశాలు జారీ చేశారు.
కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 13,032 మంది గూండాలను అరెస్టు చేసినట్టు పోలీసు శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,680 ప్రాంతాల్లో దాడులు చేశామని, 5,987 ఫోన్‌లు సీజ్ చేసినట్టు తెలిపింది. 215 మందిపై కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2007 కింద కేసులు నమోదయ్యాయి. వీరిపై కేసులు నమోదు చేయడమే కాదు.. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినందున 61 మందికి ఆ ఊరట అందకుండా చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తిరువనంతపురం నుంచి ఎక్కువ మందిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువనంతపురం రూరల్ నుంచి 1,506 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అత్యధికంగా అలప్పుజా నుంచి 1,322 మంది గూండాలను అరెస్టు చేశారు. కొల్లాం నుంచి 1,054 మంది, పాలక్కడ్ నుంచి 1,023 మంది, కాసర్‌గోడ్ నుంచి 1,020 మంది గూండాలను అరెస్టు చేసినట్టు పోలీసుల ప్రకటన వెల్లడించింది. కాగా, అత్యధిక (1,103 ) మొబైల్ ఫోన్లు తిరువనంతపురం రూరల్ నుంచే సీజ్ చేసినట్టు తెలిపింది.
Keralaలో రక్త చరిత్ర రిపీట్ అయింది. గంటల వ్యవధిలోనే రెండు రాజకీయ హత్యలు(Political Murders) జరిగాయి. నిన్న సాయంత్రం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) నేత బైక్‌పై వెళ్తుంటే కారుతో ఢీ కొట్టారు. కత్తితో పొడిచారు. ఆ గాయాలతో హాస్పిటల్‌లో మరణించాడు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే.. సుమారు 12 గంటల్లోనే BJP నేతను హతమార్చారు. ఈ రెండు పార్టీలు పరస్పరం ఒకదానిపై మరొకటి హత్యకు బాధ్యులుగా ఆరోపణలు చేసుకున్నాయి. ఈ హత్యలు రెండు అలప్పూజా జిల్లాలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు జిల్లాలో రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.
నిన్న సాయంత్రం ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ బైక్‌పై ఇంటికి వెళ్లుతున్నారు. ఆ సమయంలోనే ఓ గ్యాంగ్ కారులో ఆయన బైక్‌ను ఢీ కొట్టింది. ఆయనను అడ్డుకుంది. కత్తితో ఆయనపై దాడి చేసింది. అనంతరం ఆయనను కొందరు కొచ్చి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చారు. ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇది జరిగిన 12 గంటల్లోనే మరో నేత హత్య జరిగింది. బీజేపీ నేత ఓబీసీ యూనిట్ నేత రెంజిత్ శ్రీనివాసన్‌ను కొందరు దుండగులు ఇంటికి వెళ్లి నరికి చంపారు. కొందరు దుండగులు గ్యాంగ్‌గా ఏర్పడి బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రెటరీ రెంజిత్ శ్రీనివాస్ ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లారు. కత్తితో నరికి ఆయనను హతమార్చారు.