
శాసన సభ సభ్యుడిగా కొనసాగేందుకు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. అంతకు ముందు లక్నోలో జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆయన ఎస్పీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
403 మంది సభ్యులు ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 111 మంది ఎమ్మెల్యేలతో సమాజ్ వాదీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో SP నేతృత్వంలోని కూటమికి 125 సీట్లు వచ్చాయి.
యూపీలో అధికార బీజేపీ తరువాత అధికంగా అసెంబ్లీ స్థానాలు ఎస్పీకే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ వివరాలు వెల్లడించారు. ‘‘ యూపీ శాసనసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (సభ్యుల వేతనాలు, పెన్షన్) చట్టం 1980లోని సెక్షన్ 1(హెచ్) ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు ’’ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఉత్తరప్రదేశ్ విధాన్ సభ సెక్రటేరియట్) ప్రదీప్ దూబే పేర్కొన్నారు.
చివరిసారిగా 2007లో అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ప్రతిపక్ష నేతగా ఇలాగే మాజీ ముఖ్యమంత్రిని నియమించారు. కాగా ప్రతిపక్షనేతగా నియమితులైన వెంటనే అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో స్పందించారు. ‘‘ సమాజ్‌వాదీ పార్టీ '111' లక్ష్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడడమే అని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మైన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎస్పీ బఘెల్‌పై ఆయన 60 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో మంగళవారం ఆయన ఆజంగఢ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
అఖిలేష్ యాదవ్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత.. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ మాట్లాడుతూ.. “ అతని (అఖిలేష్ యాదవ్) పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అవధేష్ ప్రసాద్ ప్రతిపాదించారు. ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ బలపరిచారు. అసెంబ్లీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు అఖిలేష్‌కి ఆశీస్సులు అందించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకిస్తాం. గతంలో బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది.అందుకే 2017తో పోలిస్తే తక్కువ సీట్లు ఇచ్చారు ’’ అని అన్నారు.
“ప్రజలు అఖిలేష్ యాదవ్ పై విశ్వాసం చూపించారు. ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి కూడా ఓటు వేశారు. కానీ బీజేపీ అధికార దుర్వినియోగం కారణంగా చాలా మంది ఓటర్లు దూరమయ్యారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితా నుంచి సమాజ్ వాదీ పార్టీ మద్దతుదారుల పేర్లు తొలగించారు” అని నరేష్ ఉత్తమ్ పటేల్ ఆరోపించారు.