Twitter: ఓనర్‌ను బట్టి భారత చట్టాలు మారవు: ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడంపై కేంద్రమంత్రి

Published : Apr 27, 2022, 06:28 PM IST
Twitter: ఓనర్‌ను బట్టి భారత చట్టాలు మారవు: ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడంపై   కేంద్రమంత్రి

సారాంశం

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కొనుగోలు చేయడంపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఏ సోషల్ మీడియా వేదికకైనా.. దాని యజమానులు ఎవరనేదానికి అతీతంగా భారత చట్టాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓనర్‌ను బట్టి చట్టాలు మారబోవని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడంపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఏ సోషల్ మీడియా అయినా.. దాని ఓనర్ ఎవరు అనేదానిని బట్టి భారత చట్టాలు మారవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రైజీనా డైలాగ్ 2022 కార్యక్రమంలో పాల్గొన్నారు. బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసే అంశంపై స్పందించారు. భద్రత, విశ్వాసం, జవాబుదారీతనం, ఓపెన్‌నెస్ వంటి అంశాల్లో
ఇంటర్మీడియరీ నుంచి ఆశించే లక్ష్యాలు ఒకేలా ఉంటాయని, యజమానుల బట్టి మారబోవని పేర్కొన్నారు. 

‘డిమినిష్డ్ డెమోక్రసీ: బిగ్ టెక్, రెడ్ టెక్, డీప్ టెక్’ అంశంపై ప్యానెల్ చర్చించింది. ఈ చర్చలోనే కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విధంగా పేర్కొన్నారు. ఈ అంశాలపై అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి చర్చ అవసరం అని, నేరపూరిత అంశాలను అధిగమించి మరింత దూరం సోషల్ మీడియా వేదికలు వెళ్లాల్సి ఉన్నదని తెలిపారు.

సోషల్ మీడియా యూజర్లను ఏది నష్టపరుస్తున్నది? ఏది గాయపరుస్తున్నది? అనే అంశాలపై ముందు ఏకాభిప్రాయానికి రావల్సి ఉంటుందని వివరించారు. ఇందుకోసం ఈ సోషల్ మీడియా వేదికలు సరైన రీతిలో పరిశీలనలు చేయాలని, యాజమాన్యం అయితే, ఒక వేదికగా లేదా ఒక యూజర్‌గా సవాళ్లను పరిశీలించాలని తెలిపారు.

"

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న సెక్షన్ 79 వీటికి సరైన అవకాశాలు  కల్పిస్తున్నదని వివరించారు. సరైన పర్యవేక్షణ ఉన్నంత కాలం సోషల్ మీడియాలో నేరాలు అదుపులో ఉంటాయని అన్నారు. తమ సోషల్ మీడియా వేదికపై యూజర్లను గాయపరిచేవి లేదా నేరపూరిత వ్యవహారాలేమీ లేకుండా యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, ఒకవేళ యూజర్ గాయపడినా.. నేరాలు జరిగినా.. వాటిని దర్యాప్తు చేయడానికి యాజమాన్యాలు తప్పకుండా అనుమతులు ఇవ్వాలని వివరించారు.

అదే విధంగా సోషల్ మీడియా రన్ అయ్యే అల్గారిథమ్‌నూ ఆయన ప్రస్తావించారు. అల్గారిథమ్‌లో పక్షపాతాలు ఉంటాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇది నిజం అని, ఎందుకంటే.. అల్గారిథమ్‌ను కోడ్ చేసే కోడర్‌లకు కూడా జీవితంపై వారికంటూ ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయని పేర్కొన్నారు. బిగ్ టెక్ వేదికలను చూస్తే.. ఒక పార్టీకి ఉద్యోగులు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారనేది పరిశీలిస్తే.. మనకు అనేక విభిన్న అభిప్రాయాలు కనిపిస్తాయని ఉదహరించారు. కాబట్టి, ఈ సోషల్ మీడియాలు వినియోగించే అల్గారిథమ్‌లపైనా, వాటి స్ట్రక్చర్‌లపైనా జవాబుదారీతనం, పారదర్శకతను పాటించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ దారిలో మందుకు సాగడానికి ప్రయత్నాలు జరగాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu