Opposition Unity: 2024 ఎన్నికల వ్యూహం కోసం 12న ప్రతిపక్షాల భారీ సమావేశం

By Mahesh KFirst Published May 28, 2023, 7:43 PM IST
Highlights

సుమారు 18 ప్రతిపక్ష పార్టీలు బిహార్‌ రాజధాని పాట్నాలో వచ్చే నెల 12వ తేదీన సమావేశం కాబోతున్నాయి. 2024 జనరల్ ఎలక్షన్‌లో అమలు చేయాల్సిన వ్యూహానికి సంబంధించి ఈ భేటీ ఉండనుంది.
 

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలని ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టాలని భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే ఈ వైపు అడుగులు వడిగా పడ్డాయి. కాంగ్రెస్ అందుకు సుముఖత వ్యక్తం చేయడం.. వెనువెంటనే బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశాలు జరిపి ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నాలు వేగం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అంటే విముఖత వ్యక్తం చేసిన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్‌లను‌లను నితీశ్ కుమార్ కన్విన్స్ చేయగలిగారు.

ఈ తరుణంలోనే ప్రతిపక్ష పార్టీలు జూన్ 12వ తేదీన బిహార్‌లోని పాట్నాలో భారీ సమావేశానికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ సమావేశానికి భావసారూప్యత గల 18 ప్రతిపక్ష పార్టీలు హాజరు కాబోతున్నాయి. ఇది కేవలం ఒక సన్నాహక సమావేశం మాత్రమే అని ఓ సీనియర్ ప్రతిపక్ష నేత వివరించారు. అయితే, ప్రతిపక్షాల ముఖ్యమైన సమావేశం ఈ భేటీ అనంతరం మరికొన్ని రోజులకు ఉంటుందని తెలిపారు.

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 20 ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా బాయ్‌కాట్ చేయడం ఈ దిశగా వేసిన అడుగులకు ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తున్నారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం..  ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని, ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహించే దేశ తొలి పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: కొత్త పార్లమెంటు ప్రారంభం.. మరి పాత పార్లమెంటు భవనాన్ని ఏం చేస్తారు?

ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు అవి బలంగా ఉన్న స్థానాల్లో వాటినే పోటీకి అనుమతించి (కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడం).. ఇతర చోట్ల అంటే.. సుమారు 200 స్థానాల్లో కాంగ్రెస్ నేరుగా బీజేపీతో తలపడటానికి సంబంధించి ప్రాథమిక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తున్నది. తద్వార ప్రాంతీయ పార్టీలు నష్టపోకుండా ఉంటాయని, వాటికి దక్కాల్సిన సీట్లు దక్కినట్టు అవుతుందని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలహీనంగా ఉండే చోట.. లేదా కాంగ్రెస్ బలంగా కనిపించే స్థానాల్లో హస్తం పార్టీకి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపాలి. 

click me!