కొత్త పార్లమెంటు ప్రారంభం.. మరి పాత పార్లమెంటు భవనాన్ని ఏం చేస్తారు?

By Mahesh KFirst Published May 28, 2023, 5:23 PM IST
Highlights

ఈ రోజు నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇదే తరుణంలో పాత పార్లమెంటు బిల్డింగ్‌ను ఏం చేస్తారనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం గతంలో పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ భవనాన్ని కూల్చేయబోమని మాత్రం స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: అన్ని మతాల ప్రార్థనల నడుమ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. రాజదండం సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్ కుర్చీ దగ్గర ఉంచారు. ఈ రాజదండాన్ని బ్రిటీష్‌వారీ నుంచి భారతీయులకు అధికార మార్పిడీకి గుర్తుగా కొందరు చెబుతున్నారు. రాచరికం వదిలి ప్రజాస్వామ్యంలోకి వచ్చినందున ఆ రాజదండానికి ప్రాసంగికత లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ చర్చను పక్కనపెడితే.. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమైన నేపథ్యంలో పాత పార్లమెంటు భవనాన్ని ఏం చేస్తారనే అనుమానాలు రావడం సహజం. దీనిపై ఇది వరకే కేంద్ర ప్రభుత్వం కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నది.

భారత దేశ ప్రజాస్వామ్యంలో, స్వాతంత్ర్యంలో పాత పార్లమెంటు భవనానికి ప్రాముఖ్యత ఉన్నది. ఆ పార్లమెంటు భవనంలోనే చరిత్రాత్మక చట్టాలు వచ్చాయి. నవ్వులు, నిరసనలు, గంభీరమైన ప్రసంగాలు, కఠిన నిర్ణయాలు అన్నింటినీ ఆ పాత పార్లమెంటు భవనం చూసింది. దేశ చరిత్రలోని ఎన్నో కీలక మూలమలుపులకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం ప్రకారం, ఆ చారిత్రక భవనం ఇప్పుడు పట్టుతప్పుతున్నది. ఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అవసరాలకు ఈ భవనం సరిపడటం లేదు. ముఖ్యంగా సాంకేతికత, స్థలం, ఇతర వసతులు ఇది సమకూర్చడం లేదు. అందుకే నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. 

ఈ భవనానికి జాతీయంగా ప్రాధాన్యత ఉంటుందని, కాబట్టి, దాన్ని సంరక్షించాలని కేంద్రం భావిస్తున్నది. దేశ రాజ్యాంగం ఎంపిక చేసుకున్న ఈ భవనాన్ని కాపాడాలని ఆలోచిస్తున్నది. 

పాత పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తారా?

మార్చి 2021లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ విషయంపై వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పాత భవనానికి రిపేర్లు చేస్తామని వివరించారు. ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలనే ఆలోచనలు చేస్తామని తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు పాత పార్లమెంటు భవనంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని వివరించారు. 

Also Read: భర్త కంటే భార్యే ఎక్కువ సంపాదిస్తున్నది.. భరణం చెల్లించడంపై కోర్టు ఆసక్తికర తీర్పు

పాత పార్లమెంటు భవనాన్ని కూల్చేయబోమని, ఒక ఆర్కియాలజికల్ సంపదగా ఉన్న ఈ భవనాన్ని సంరక్షిస్తామని, పార్లమెంటరీ కార్యక్రమాలకు వినియోగిస్తామని కేంద్రం తెలిపింది. కొత్త పార్లమెంటు భవనంతోపాటు దీన్ని కూడా వినియోగంలో ఉంచే ప్రయత్నం చేస్తామని పేర్కొంది.

కాగా, 2022లో ఓ మీడియా రిపోర్టు ప్రకారం, పాత పార్లమెంటు భవనాన్ని మ్యూజియంగా మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. పాత భవనాన్ని మాత్రం కేంద్రం సంరక్షిస్తుందనేది స్పష్టం.

click me!