
Opposition meets at Sharad Pawar’s residence: ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీలు గత కొంత కాలంగా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్ ఆరోపణలపై చర్చించడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ నివాసంలో పలు ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం అనంతరం ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), శివసేన తదితర పార్టీలు పాల్గొన్న ఈ సమావేశం గంటకు పైగా సాగింది. ఎన్సీపీ చీఫ్ ఆహ్వానం ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సమావేశానికి గైర్హాజరైనట్లు వార్తాసంస్థ పీటీఐ నివేదించింది.
ఈవీఎంల సమర్థత, ఈవీఎం ద్వారా ఓటు వేయడంపై రాజకీయ పార్టీలు లేవనెత్తిన ఆందోళనలపై చర్చించేందుకు తన నివాసంలో ప్రతిపక్ష నేతల సమావేశం జరిగిందని శరద్ పవార్ ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ.. "ఏ యంత్రాన్నైనా తారుమారు చేయవచ్చు. ఇది స్వతంత్ర యంత్రం కాదని మేము చాలా సంవత్సరాలుగా చెబుతున్నాము అనేది మా ఆందోళన. దాన్ని ప్రోగ్రామ్ చేసుకునేందుకు వీలుగా ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఎందుకంటే మాకు సమాధానాలు లభించేలా కనిపించడం లేదని" తెలిపారు.
ఈవీఎంల విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్ని పార్టీలు అంగీకరించాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి సరైన స్పందన కోరాలనీ, ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూసి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. పరువునష్టం కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గుజరాత్ కోర్టు దోషిగా తేల్చిన విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించామని, అయితే దీనిపై సమగ్రంగా చర్చ జరగలేదని రాజా తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన చట్టంపై మాత్రమే నేతలు చర్చించారని కపిల్ సిబల్ తెలిపారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పార్టీలు ఏకమై మరిన్ని రాజకీయ పార్టీలను తమ కూటమిలో చేర్చుకునే ప్రయత్నాల మధ్య ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందంలో కీలక శక్తిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. శుక్రవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవనున్నారు. విపక్షాలకు ఈవీఎంలు వివాదాస్పద అంశంగా మారాయి. గతంలో వివిధ ఎన్నికల సమయంలో యంత్రాలను ట్యాంపరింగ్ చేశారని వారు ఆరోపించినప్పటికీ, ఈ ఆరోపణను రుజువు చేయడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు.
ఓటింగ్ కోసం యంత్రాలను భద్రంగా తరలిస్తున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. 2017లో ఎన్నికల సంఘం కూడా ఈ పరికరాలపై తమ ఆరోపణలను రుజువు చేయాలని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరింది. ఏ పార్టీ కూడా తమ వాదనను రుజువు చేసుకోలేకపోవడంతో తిరిగి పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అయితే పారదర్శకత కోసం అన్ని ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను వినియోగిస్తామని ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. వీవీప్యాట్ లో అభ్యర్థి పేరు, ఓటు వేసిన వ్యక్తి గుర్తును పేపర్ రసీదులో నమోదు చేస్తారు.