అప్పు చేసి పప్పుకూడులా బడ్జెట్.. అన్నీ ప్రగల్బాలే : బసవరాజ్ బొమ్మైపై సిద్ధరామయ్య విమర్శలు

Siva Kodati |  
Published : Mar 08, 2022, 04:35 PM IST
అప్పు చేసి పప్పుకూడులా బడ్జెట్.. అన్నీ ప్రగల్బాలే : బసవరాజ్ బొమ్మైపై సిద్ధరామయ్య విమర్శలు

సారాంశం

కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుచేసి పప్పుకూడు చందాన ఉందన్నారు ప్రతిపక్షనేత సిద్ధరామయ్య. బడ్జెట్‌పై ఆర్‌ఎస్ఎస్‌ ముద్ర కనిపిస్తోందని.. ఎన్నికల భయంతోనే ప్రజలపై పన్నుల భారం మోపలేదన్నారు.

కర్ణాటక (karnataka budget 2022)  ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (basavaraj bommai) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ (congress) అసహనం వ్యక్తం చేసింది.  2022-23 వార్షిక బడ్జెట్‌ దిశానిర్దేశం లేకుండా సాగిందని, ఇదొక నిరాశాదాయక బడ్జెట్‌ అని ప్రతిపక్షనేత సిద్దరామయ్య (siddaramaiah) ఆరోపించారు. బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటూ పదే పదే డాంబికాలు చెప్పుకుంటున్నారని సిద్ధరామయ్య చురకలంటించారు. బీజేపీ నేతలు చెప్పే ప్రగల్బాలకు, బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు పొంతన లేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌ మొత్తానికి అప్పు చేసి పప్పుకూడు చందాన ఉందంటూ ఎద్దేవా చేశారు. 

ఈనెల చివరినాటికి మూడు ఆర్థిక సంవత్సరాలు ముగుస్తాయని... ప్రస్తుతం నాల్గవ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుందని సిద్ధరామయ్య గుర్తుచేశారు. 2023 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉందని... ప్రభుత్వం బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయో ఇట్టే ఊహించుకోవచ్చునని చురకలు వేశారు. బడ్జెట్‌పై ఆర్‌ఎస్ఎస్‌ (rss) ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన బీజేపీ (bjp) ప్రభుత్వం ఇంతవరకు సాధించిన ప్రగతి, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఇత్యాది అంశాలపై శ్వేతపత్రం ప్రకటిస్తే బాగుండేదన్నారు. తాను ముఖ్యమంత్రి హోదాలో ఆరుసార్లు, ఆర్థికశాఖ మంత్రి హోదాలో 13 సార్లు బడ్జెట్‌ ను సమర్పించానని, చెప్పినవన్నీ అమలు చేశామని సిద్దరామయ్య గుర్తుచేశారు. 

బడ్జెట్‌ రూ.2.65 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో రూ.14,699 కోట్ల రెవెన్యూ కొరత ఉందని దీన్ని ఎలా సమీకరించుకుంటారో ప్రభుత్వం స్పష్టం చేయలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ బడ్జెట్‌.. తనకు కావాల్సిన వారికి మిఠాయిలు పంచుకున్న చందాన ఉందని సిద్ధరామయ్య సెటైర్లు వేశారు. ఎన్నికల భయంతోనే పన్నుపోటు వేయలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషలిస్టు భావాలు కలిగిన బొమ్మై వ్యక్తిగతంగా తనకు మంచి స్నేహితుడని, బీజేపీలో చేరి దారి తప్పాడని సిద్ధరామయ్య చురకలంటించారు. రాజకీయాలలో స్నేహం వేరు, సిద్ధాంతాలు వేరు అన్నారు. దీనికి సీఎం బొమ్మై బదులిస్తూ బీజేపీలో సోషలిస్టు నేతలు చేరుతున్నారంటే ఎక్కడ విశాలమైన వాతావరణం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఆర్‌ఎస్ఎస్‌ను పదేపదే విమర్శించడం మంచిది కాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu