
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (russia ukraine crisis) నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ విద్యార్ధులను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తరలిస్తోన్న సంగతి తెలిసిందే. ఎయిరిండియా (airindia), వాయుసేన (indian airforce) విమానాల సాయంతో ‘ఆపరేషన్ గంగా’ను (operation ganga) నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 16 వేల మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తరలించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆదివారం వెల్లడించింది.
ఆదివారం నాడు 11 విమానాల్లో మొత్తం 2135 మంది భారత్‌కు చేరుకున్నట్లు తెలిపింది. మరో ఎనిమిది విమానాలు సోమవారం చేరుకుంటాయని.. వాటిలో 1500 మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఆదివారం భారత్‌కు చేరుకున్న మొత్తం 11 విమానాల్లో తొమ్మిది ఢిల్లీకి.. రెండు ముంబయికి చేరుకున్నాయి. వాటిలో ఆరు విమానాలు బుడాపెస్ట్ నుంచి, రెండు పొలండ్, మరొకటి స్లొవేకియా నుంచి ఇండియాకు వచ్చాయి.
మరోవైపు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం (indian embassy in ukraine) ఆదివారం నాడు భారత పౌరులను తరలించే ఆపరేషన్ గంగా చివరి దశను ప్రారంభించింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులు తాము ఉంటున్న నివాసాలను వదిలి వెంటనే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌లోని హంగేరియా సిటీ సెంటర్‌కు చేరుకోవాలని కోరింది. ట్వీట్టర్ లో "ముఖ్యమైన ప్రకటన: భారత రాయబార కార్యాలయం ఈరోజు ఆపరేషన్ గంగా విమానాల చివరి దశను ప్రారంభించింది. వారి స్వంత వసతి (ఎంబసీ ద్వారా ఏర్పాటు చేయబడినవి కాకుండా) ఉన్న విద్యార్థులందరూ @Hungariacitycentre, Rakoczi Ut 90, బుడాపెస్ట్‌కు ఉదయం 10-12 గంటల మధ్య చేరుకోవాలని కోరుతున్నాం" అని పేర్కొంది.
ఇంతకుముందు చేసిన ట్వీట్‌లో.. ఉక్రెయిన్‌లో ఇప్పటికీ చిక్కుకుపోయిన భారత పౌరులను ప్రాథమిక వివరాలను పేర్కొన్న ఫారమ్‌ను పూరించమని రాయబార కార్యాలయం అభ్యర్థించింది. ఎంబసీ అధికారిక ట్విట్టర్ ఖాతా.. అక్కడ చిక్కుకుపోయిన వారి పేరు, పాస్‌పోర్ట్ నంబర్ మరియు ప్రస్తుత లొకేషన్ వంటి ప్రాథమిక వివరాలను కోరుతూ గూగుల్ ఫారమ్‌ను పోస్ట్ చేసింది. "ఇప్పటికీ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ అటాచ్ చేసిన Google ఫారమ్‌లో ఉన్న వివరాలను అత్యవసర ప్రాతిపదికన పూరించాలని అభ్యర్థించబడింది. సురక్షితంగా.. ధైర్యంగా ఉండండి" అంటూ ట్వీట్ చేసింది.