ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకముందే కన్నుమూస్తున్నారు: ప్రభుత్వం డేటా

Published : Jun 04, 2022, 05:18 PM IST
ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకముందే కన్నుమూస్తున్నారు: ప్రభుత్వం డేటా

సారాంశం

మన దేశంలో శిశు మరణాల రేటు ఇంకా ఎక్కువగానే ఉన్నది. గత ఐదు దశాబ్దాల వివరాలతో పోలిస్తే శిశు మరణాలు రేటు తక్కువే అయినా.. మొత్తంగా చూసుకుంటే శిశువుల మరణాలు ఆందోలనకరంగానే ఉన్నాయి. ప్రతి 36 మంది శిశువుల్లో ఏడాది తిరిగేలోపు ఒకరు మరణిస్తున్నట్టు ప్రభుత్వ వివరాలు వెల్లడిస్తున్నాయి.  

న్యూఢిల్లీ: భారత దేశంలో శిశు మరణాల రేటు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అయినా.. ప్రస్తుత శిశు మరణాల రేటు కూడా ఎక్కువే. కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం, ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు ఏడాది నిండకముందే కన్నుమూస్తున్నారు.

నిర్దిష్ట స్థల కాలాల్లో ప్రతి వేయి జననాల్లో మరణించే శిశువుల (ఏడాది లోపు వయసు) సంఖ్యనే శిశు మరణాల రేటు అంటారు. ఈ శిశు మరణాల రేటు రిపోర్టును రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే విడుదల చేసింది. 2020లో శిశు మరణాల రేటు 28గా ఉన్నది. అంటే.. ప్రతి వేయి మంది శిశువుల్లో 28 మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్యను 1971 వివరాలతో పోలిస్తే నాలుగో వంతు కూడా లేవు. అప్పుడు ప్రతి వేయి జననాల్లో 129 మంది శిశువులు మరణించారు.

గత దశాబ్ద కాలంలో శిశు మరణాల రేటు 36 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా గత దశాబ్దం శిశు మరణాలు 44 నుంచి 28కి తగ్గాయి. ఈ కాలంలో పట్టణంలో (34 శాతం) కంటే గ్రామీణంలోనే (35 శాతం తగ్గింపు) శిశు మరణాలు రేటు ఎక్కువగా తగ్గింది. అంటే గ్రామీణంలో 48 శిశు మరణాల నుంచి 31కి పడిపోయింది. అదే పట్టణ ప్రాంతాల్లో ప్రతి వేయి జననాల్లో 29 మంది మరణాల నుంచి 19 మరణాలకు తగ్గింది.

గత దశాబ్దంతో పోలిస్తే శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ.. ప్రతి 36 మంది చిన్నారుల్లో ఒకరు ఏడాది నిండకముందే.. తమ తొలి బర్త్ డే జరుపుకోక ముందే కళ్లు మూస్తున్నారు.

2020లో మధ్యప్రదేశ్ అత్యధిక శిశు మరణాల రేటు (43) నమోదు చేయగా.. మిజోరం (3 చ) అత్యల్ప రేటును నమోదు చేసింది.

అలాగే.. జనాభా పెరుగుదలకు కీలకమైన జననాల రేటు కూడా ఐదు దశాబ్దాల వివరాలతో పోలిస్తే దారుణంగా పడిపోయింది. 1971లో జననాల రేటు 36.9 శాతం ఉండగా, 2020లో ఇది 19.5 శాతంగా ఉన్నది. అయితే, గత ఐదు దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉంటున్నది.

జననాల రేటు గత దశాబ్ద కాలంతో పోలిస్తే మొత్తంగా తగ్గిపోయింది. 2011లో జననాల రేటు 21.8గా ఉంటే.. 2020లో ఇది 19.5గా ఉన్నది. కాగా, గ్రామీణ ప్రాంతంలో 23.3 నుంచి 21.1 అంటే తొమ్మిది శాతం తగ్గింది. అదే పట్టణ ప్రాంతాల్లో 17.6 నుంచి 16.1 జననాల రేటు తగ్గింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?