
జైపూర్: ఈ ఏడాది భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నది. ఈ వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ ప్రభుత్వం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రాజస్తాన్‌లో సుమారు కోటి మంది విద్యార్థులు ఏకకాలంలో సుమారు 25 నిమిషాల పాటు దేశ భక్తి గీతాలను ఆలపించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ స్టూడెంట్లు ఉదయం 10.15 గంటల నుంచి ఉదయం 10.40 గంటల వరకు దేశ భక్తి గీతాలను పాడారు. ప్రధాన కార్యక్రమం రాజధాని జైపూర్‌లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగింది. సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వందే మాతరం, సారే జహాన్ సె అచ్ఛా, హమ్ హోంగే కామ్యాబ్, జాతీయ గీతం పాటలను 25 నిమిషాల పాటు విద్యార్థులు ఆలపించారు.
అనంతరం, సీఎం అశోక్ గెహ్లాట్ విద్యార్థులపై ప్రశంసల జల్లు కురిపించారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోటి మంది విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలను విన్నదని, ఆ తర్వాత రాస్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్ ప్రెజెంట్ చేసిందని వివరించారు. నవ తరం సహోదర భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం యోధులు చేసిన త్యాగాలను గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఎందుకంటే.. ఈ తరమే దేశానికి భవిష్యత్తు అని తెలిపారు.