భారత్‌లో సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్న ఒమిక్రాన్.. INSACOG రిపోర్టులో షాకింగ్ విషయాలు

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 5:02 PM IST
Highlights

భారత్‌లో కరోనా వైరస్ కేసులు (Coronavirus) భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా భారత్‌లో రోజువారి కొత్త కేసుల సంఖ్య 3 లక్షలకు పైగానే నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని INSACOG తెలిపింది.
 

భారత్‌లో కరోనా వైరస్ కేసులు (Coronavirus) భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా భారత్‌లో రోజువారి కొత్త కేసుల సంఖ్య 3 లక్షలకు పైగానే నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్సాకాగ్) నివేదికలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని తెలిపింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లుగా అంచనా వేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ( Union Ministry of Health and Family Welfare) ఆధ్వర్యంలోని INSACOG దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌లో వైవిధ్యాలను తనిఖీ చేస్తుంది. దేశంలో వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఎలా అభివృద్ది చెందుతుందనే దానిని పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా సాధ్యమైనంత ఉత్తమమైన ప్రజారోగ్య ప్రతిస్పందనను సూచించడంలో సహాయపడుతుంది.

ఇన్సాకాగ్ తాజా రిపోర్ట్‌లో.. ‘కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో పలు మెట్రో నగరాలలో వ్యాపించడంతో పాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆ కారణంగానే ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మెట్రో నగరాల్లో నమోదవుతున్న ఎక్కువ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే. కొన్నిచోట్ల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.2 వ్యాప్తి చెందుతుంది. S-జీన్ డ్రాప్-అవుట్ అనేది ఓమిక్రాన్ మాదిరిగానే జన్యు వైవిధ్యం’ అని పేర్కొంది.

జనవరి 10కి సంబంధించిన బులిటెన్‌ను ఇన్సాకాగ్ ఆదివారం విడుదల చేయగా.. అందులో ఇప్పటివరకు చాలా ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలు లేనివి/తేలికపాటి లక్షణాలు ఉన్నవేనని తెలిపింది. అయితే ప్రస్తుత వేవ్‌లో ఆస్పత్రిలో చేరడం, ఐసీయూ కేసులు పెరిగాయని తెలిపింది. ముప్పు స్థాయి మారలేదని తెలిపింది. ‘Omicron ఇప్పుడు భారతదేశంలో సామాజిక వ్యాప్తి దశలో ఉంది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ ఆధిపత్యం చెలాయించింది.. అక్కడ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. BA.2 కేసులు కూడా భారీగానే ఉన్నాయి’ అని పేర్కొంది.

ఇక, ఇటీవల నివేదించబడిన కొత్త SARS-CoV-2 వేరియంట్ B.1.640.2‌ను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపింది. ఈ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇది రోగనిరోధకతను తప్పించుకునే లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ..  ప్రస్తుతం ఆందోళన కలిగించే వేరియంట్ కాదని పేర్కొంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకు భారతదేశంలో ఎటువంటి కేసు కనుగొనబడలేదని స్పష్టం చేసింది. 

ఇక, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల (Corona cases) సంఖ్య 3,92,37,264కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా‌తో 525 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,59,168‌ మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి జయించినవారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

click me!