
మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల బంగాళ దుంపలు, ఉల్లి ధర భారీగా పెరగగా.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. గడచిన వారంలో ఆలూ ధరలు 40 రూపాయల దిగువకు చేరాయి. ఇదేవిధంగా ఉల్లి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
అయితే సామాన్యుడికి ఎంతో అవసరమైన అన్ని రకాల వంట నూనెల ధరలు మరింతగా పెరిగాయి. వీటి ధరలు తగ్గేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం డిసెంబరు 6 తరువాత నుంచి దేశంలో వంట నూనెల ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
కాగా ఇంతవరకూ కిలోకు రూ. 42.88 ఉన్న ఆలూ ధర ఇప్పుడు రూ. 36.62కు చేరుకుంది. 60 రూపాయలున్న కిలో ఉల్లి ధర ఇప్పుడు 44 రూపాయలకు చేరింది. గతంలో విధించిన కరోనా లాక్‌డౌన్ కారణంగా మలేషియా తదితర దేశలలో నూనె ఉత్పత్తులు మందగించాయి. ఇది నూనె ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.