
Mamata Banerjee: దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన పెగాసస్( Spyware)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మమతా మాట్లాడుతూ, ‘పెగాసస్’ (Spyware)ను తయారు చేసిన ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ 4-5 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. వివాదాస్పద పెగాసస్‌ను స్పైవేర్‌ను కేవలం రూ. 25 కోట్లకే అందిస్తామని చెప్పారన్నారు. కానీ, దానిని తిరస్కరించామన్నారు. దానిని కొనుగోలు చేయలేదనీ, భద్రతా కారణాల వల్ల దానిని తిరస్కరించినట్టు తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ స్పైవేర్‌ను కొనుగోలు చేసి, దేశ భద్రత కోసం ఉపయోగించకుండా.. రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారులు, న్యాయమూర్తులపై కన్నేయడం దురదృష్టకరమని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
బెనర్జీ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశం మాట్లాడుతూ.. NSO, పెగాసస్ తయారీదారు తమ వస్తువులను విక్రయించడానికి ప్రతి ఒక్కరినీ సంప్రదించారు. నాలుగు-ఐదేళ్ల క్రితం కూడా మన పోలీసులను ఆశ్రయించి రూ.25 కోట్లకు అమ్ముతామన్నారు. నాకు సమాచారం రాగానే మాకు అవసరం లేదని చెప్పాను. ప్రజల గోప్యత దెబ్బతింటుందని, దానిని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను తమ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. ఎవరు ఆఫర్‌తో వచ్చారో పేర్కొనలేదు. భారతీయ పౌరులపై స్నూపింగ్ ఆరోపణల వివాదం ఉధృతంగా ఉన్న సమయంలో కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తున్నట్లు గత ఏడాది తెలిపింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మేనల్లుడు, టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై పలువురు నేతలు, అధికారులు, న్యాయమూర్తులు నిఘాలో ఉన్నారని గత ఏడాది జూలైలో మీడియా కథనాలు రావడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది. ఆగస్ట్ 2021లో బెంగాల్ దర్యాప్తునకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎంబీ లోకూర్, కలకత్తా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) జ్యోతిర్మయి భట్టాచార్యతో కూడిన విచారణ కమిషన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3 ద్వారా అందించబడిన అధికారాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. బెంగాల్ ప్రభుత్వ విచారణ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభావితం కాలేదని న్యాయమూర్తి (రిటైర్డ్) జ్యోతిర్మయి భట్టాచార్య మీడియాకు తెలిపారు.
పెగాసస్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) అక్రమ హ్యాకింగ్, నిఘా, డేటా, కాల్‌ల రికార్డింగ్ కోసం ఉపయోగించిందని విచారణను ప్రకటిస్తూ మమతా బెనర్జీ అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని ఆమె సంచలన ప్రకటన చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ వాదనను ఖండించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటి కొనుగోళ్లు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న లోకేశ్, మమతా బెనర్జీ వాదనపై మాట్లాడుతూ, “'పెగాసెస్ సాప్ట్ వేర్ ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు. నిజంగానే పెగాసెస్ సాఫ్ట్ వేర్ మేం కొనుగోలు చేసివుంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా..? మాపై చర్యలు తీసుకోకుండా జగన్ మూడేళ్లపాటు ఆగి ఉండేవారా..?'' అని పేర్కొన్నారు.
''టీడీపీ తప్పులు వెతకడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారు. కానీ ఎక్కడా మేము తప్పుచేసినట్లు బైటపడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిజంగానే కామెంట్ చేసి ఉంటే ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు'' అన్నారు.