ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..పెరుగుతోన్న మృతుల సంఖ్య.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..?

By Rajesh KarampooriFirst Published Jun 3, 2023, 1:21 AM IST
Highlights

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్‌ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.  

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు కూలిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించగా.. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్ష‌త‌గాత్రుల‌ను సోరో, గోపాల్‌పూర్‌, ఖంట‌పాడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు త‌ర‌లించారు.

క్షత‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్య అధికారులు తెలిపారు. చీకటిలోనూ రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సహాయక చర్యల్లో NDRF చెందిన 3 యూనిట్లు, ODRAF చెందిన  4 యూనిట్లు పాల్గొంటున్నాయి. అదే సమయంలో 60 అంబులెన్స్‌లు రెస్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ప్రమాదం తర్వాత అనేక రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. 
 
ప్రత్యేక సాక్షి కథనం 

ఈ తరుణంలో ఒక ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియా (కళింగ టీవీ)తో మాట్లాడుతూ.. "మేము రైలులో కూర్చున్నాము. అకస్మాత్తుగా కోచ్ వేగంగా కంపించడం ప్రారంభించింది. మరుక్షణంలోనే కోచ్ బోల్తాపడింది. ప్రమాదం జరిగిన తర్వాత మా గ్రామంలో చాలా మంది వ్యక్తులు కనిపించడం లేదు. ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియరావడం లేదు" అని పేర్కొన్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ఉన్న మరో ప్రయాణికుడు గోవింద్ మోండల్ అనే మరో ప్రయాణికుడు మీడియా(న్యూస్ 18 బంగ్లా)తో  మాట్లాడుతూ, "మేము చనిపోతామని అనుకున్నాము. పగిలిన కిటికీ సహాయంతో కంపార్ట్‌మెంట్ నుండి బయటికి వచ్చాము. నేను ఆశలన్నీ వదులుకున్నాను.ప్రమాద అనంతరం విరిగిన కిటికీలోంచి బయటికి రాగలిగిన కొద్దిమంది ప్రయాణీకులలో నేను ఒకడ్ని. మమ్మల్ని ప్రథమ చికిత్స కోసం డిస్పెన్సరీకి తీసుకెళ్లారు. నేను ప్రమాదం నుంచి బయటపడ్డాను, అయితే చాలా మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి మరి దారుణం " అంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. 

ముఖ్యమంత్రి సమీక్ష

రైల్వే శాఖ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. హెల్ప్ నంబర్లు కూడా జారీ చేశారు. క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించేందుకు రైల్వే బృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా SRC కంట్రోల్ రూమ్‌కు చేరుకుని ఘటనను పరిశీలించి రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ విషాద రైలు ప్రమాద పరిస్థితిని తాను ఎప్పడికప్పుడూ సమీక్షిస్తానని సీఎం  తెలిపారు. సీఎం నవీన్ పట్నాయక్ రేపు ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.

click me!