ఆ రాష్ట్రాల నుంచి వస్తే వారం రోజులు ఐసోలేషన్ తప్పదు..!

By telugu news teamFirst Published Feb 27, 2021, 1:36 PM IST
Highlights

ఈ సమయంలో ఎవరైనా లక్షణాలుంటే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తామని, వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షిస్తే.. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ మేరకు చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 

కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర రూపం దాల్చింది. ఆ మధ్య కాస్త కరోనా ప్రభావం తగ్గినట్లే అనిపించినా.. మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. ఈ మధ్య కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ జాబితాలో ఒడిశా చేరింది. 

మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించడంతో చర్యలు ప్రారంభించింది.  మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, ఛండీగఢ్‌ నుంచి వచ్చే వారందరినీ వారం రోజుల పాటు ఐసోలేషన్‌కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సమయంలో ఎవరైనా లక్షణాలుంటే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తామని, వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షిస్తే.. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ మేరకు చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో ప్రయాణీకులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతో పాటు.. లక్షణాలు ఉన్న వారికి అక్కడికక్కడే యాంటిజెన్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలిచ్చినట్లు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి పీకే మోహపాత్రా తెలిపారు. నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉన్న, లక్షణాలు లేని వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. 

కొత్త కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నిత్యం 7500 ఆర్‌టీ-పీసీఆర్‌, 30వేల వరకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర కొవిడ్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. మెరుగైన నిఘా, ముందస్తు గుర్తింపుతోనే వైరస్‌ను నిరోధించడం సాధ్యమవుతుందన్నారు. 

click me!