
భువనేశ్వర్: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ, ఆ వరుడికి మాత్రం పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలో సెగ తగిలింది. తాను ఏరికోరి ఇష్టపడి.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాను మనసు పారేసుకుని, కుటుంబ సభ్యులకు పరిచయం చేయించి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, పెళ్లి తర్వాత రిసెప్షన్ జరుగుతుండగానే ఆ వరుడు ఊహించని షాక్ తిన్నాడు. తాను పెళ్లాడింది అమ్మాయిని కాదని, అబ్బాయిని అని తేలడంతో కుటుంబం అంతా ఖంగుతిన్నది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీ, ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాకు చెందిన రామనగర్ గ్రామానికి చెందిన బిశ్వనాథ్ మండల్ కుమర్తె మేఘనా మండల్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వారి ఫేస్ బుక్ పరిచయం ముుందుకు సాగింది. కేవలం 15 రోజుల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను పెళ్లిగతా మార్చుకోవాలని ఇరువురూ నిశ్చయించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మే 24న చండీకోల్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత మేఘనా మండల్‌ను అలోక్ కుమార్ మిస్త్రీ తన మేన మామ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన బంధువులకు పరిచయం చేశాడు.
వీరిద్దరి ప్రేమ గురించి అలోక్ కుటుంబానికి చెప్పాడు. వారంతా అలోక్ కుమార్ మిస్త్రీ, మేఘనా మండల్ పెళ్లికి అంగీకరించారు. అలోక్ కుటుంబం మొత్తం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి ముహూర్తం ఖరారైంది. ఘనంగా పెళ్లి చేశారు. అంతేకాదు, అదే రోజు కుటుంబ సమేతంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ రిసెప్షన్‌లోనే అసలు బండారం బయటపడింది. ఆ రిసెప్షన్‌కు వచ్చిన స్థానికుడు ఒకరు వధువును మేఘనా మండల్ అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వారి కుటుంబం అంతా ఖంగు తిన్నది. వధువును అబ్బాయి పేరు పెట్టి పిలవడమేంటని వరుడు కూడా షాక్ అయ్యాడు. వరుడు కుటుంబం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే పిలిచిన వ్యక్తిని ఆరా తీసింది. పెళ్లి కూతురుగా ఉన్న వ్యక్తి మేరు మేఘనాథ్ అని స్పష్టం చేశాడు ఆ అతిథి. అంతేకాదు, మేఘనాథ్ తనకు దూరపు బంధువు కూడా అని చెప్పి కుండబద్ధలు కొట్టాడు. అలా పెళ్లి కూతురు అమ్మాయి కాదు.. అబ్బాయి అని బట్టబయలు అయింది. ఈ పరిణామంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాననే ఆశలో ఉన్న పెళ్లి కుమారుడు, వరుడి కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.
పెళ్లి కొడుకును, ఆయన కుటుంబాన్ని మోసం చేసిన మేఘనాథ్‌పై అక్కడున్నవారందరికీ తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ గ్రామస్థులు మేఘనాథ్‌ను స్టేజీపై నుంచి దింపారు. చితకబాదారు. మేఘనాథ్ బట్టలు చింపేశారు. అతని పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం, ఈ ఘటన గురించి పోలీసులకు స్థానికులు తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. పోలీసులు స్పాట్‌కు వచ్చారు. మేఘనాథ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. మేఘనాథ్ కుటుంబ సభ్యులకు ఆ కుర్రాడిని అప్పగించారు.
ఎన్నో ఆశలతో ప్రేమించిన తన ప్రేయసితో పెళ్లి జరుగుతుందని ఆనంద డోళికల్లో విహరించిన వరుడు అలోక్ కుమార్ మిస్త్రీ ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. తన కలలు అన్నీ కల్లలు అయ్యాయి. ఆశలు అర నిమిషంలో ఆవిరై పోయాయి.