
Odisha government Covid financial assistance: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఒకరిని కోల్పోయిన 50,952 మంది పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. వీరిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారు 108 మందిని గుర్తించామని, వారికి రూ.2,500 చొప్పున అందజేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బసంతి హెంబ్రామ్ శాసనసభకు తెలిపారు.
ఈ పిల్లలకు ప్రభుత్వ ఆశీర్వాద్ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు లేదా కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. తల్లిదండ్రుల్లో ఒకరిని (కుటుంబ పోషణ) కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.1,500 చెల్లిస్తారు. అంతేకాకుండా, శిశు సంరక్షణ సంస్థలో నివసిస్తున్న అనాథలకు నెలకు రూ .1,000 చెల్లిస్తున్నామని హెంబ్రామ్ చెప్పారు. లబ్ధిదారులకు 18 ఏళ్లు నిండే వరకు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.
కాగా, భారతదేశంలో కోవిడ్ -19 కేసులు పెరగడంపై ఆందోళనల మధ్య, కేంద్రం భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సూచిస్తోంది. పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిన మరుసటి రోజే, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరడం, మరణాలు పెరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. అయితే మహమ్మారి ముప్పు ఇంకా ముగియలేదని ఆయన ప్రజలను హెచ్చరించారు.
ఫిబ్రవరి రెండో వారంలో కేవలం 108 కేసులు మాత్రమే నమోదు కాగా, మార్చి 23తో ముగిసిన వారంలో కోవిడ్ సంఖ్య 966కు పెరిగింది. అయితే, ప్రస్తుతం దేశంలో నిత్యం వేయికి పైగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడమే దేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,47,00,667 కరోనావైరస్ కేసులు, 5,30,818 మరణాలు నమోదయ్యాయి.