
తిరువనంతపురం: శబరిమలలో రెండో రోజు గురువారం కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. శబరిమల కొండను ఎక్కేందుకు ప్రయత్నించిన న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టు సుహాసిని రాజ్ ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. రోడ్డును బ్లాక్ చేయడంతో పాటు రాళ్లదాడి చేయడంతో ఆమె వెనక్కి వచ్చారు. అసభ్యకరమైన పదజాలంతో తిట్టారు.
సుహాసినితో పాటు విదేశీ లేడీ జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆందోళనకారులు అడ్డుకోవడంతో సుహాసిని పంబకు వెనుదిరిగారు. శబరిమలను ఎక్కేందుకు ప్రయత్నించిన మూడో మహిళ సుహాసిని. తాను ఆలయంలో ప్రవేశించడానికి రాలేదని, విధులు నిర్వహించడానికి వచ్చానని సుహాసిని చెప్పినా ఆందోళనకారులు వినలేదు. బుధవారంనాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుహాసిని, కేరళ లేడీ జర్నలిస్టు లిబిని కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు.
ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ శబరిమల సంఘర్షణ సమితి 12 గంటల రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్ర బిజెపి కూడా బంద్ కు మద్దతు ప్రకటించింది. దుకాణాలను మూసేశారు. రోడ్లపైకి వాహనాలు రావడం లేదు. సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎలవుంగల్ ప్రాంతాల్లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు.
బుధవారం సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే, ఇప్పటి వరకు 50 ఏళ్ల లోపు వయస్సు గల ఒక్క మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించలేదు. ఆందోళనకారులు జర్నలిస్టులపై దాడికి దిగారు, మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
బుధవారంనాడు 50 ఏళ్ల వయస్సు పైబడినవారు ఆలయంలోకి ప్రవేశించడం కనిపించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గలవారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు.