నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ చీఫ్ రవి నారాయణ్‌ను అరెస్టు చేసిన ఈడీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదుపులోకి

By Mahesh KFirst Published Sep 7, 2022, 4:30 AM IST
Highlights

నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ చీఫ్ రవి నారాయణ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రవి నారాయణ్ ఈడీ అధికారులకు దర్యాప్తులో సహకరించలేదని తెలుస్తున్నది. 
 

న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ చీఫ్ రవి నారాయణ్‌ను అక్రమంగా ఉద్యోగుల ఫోన్‌లు ట్యాప్ చేసిన అభియోగాల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సాయంత్రం అరెస్టు చేసింది. ఢిల్లీలో విచారణకు హాజరవ్వాలని రవి నారాయణ్‌ను దర్యాప్తు సంస్థ సమన్లు పంపింది. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులతో రవి నారాయణ్ కోఆపరేట్ చేయలేదని కొన్ని వర్గాలు వివరించాయి. అయితే, ఆయనకు వ్యతిరేకంగా లభించిన ఆధారాల మేరకు దర్యాప్తు సంస్థ మంగళవారం సాయంత్రం రవి నారాయణ్‌ను అరెస్టు చేసింది.

నేషనల్ స్టాక్స్ ఎక్స్‌చేంజ్‌లో 1994 నుంచి 2013 మధ్య కాలంలో అనేక హోదాల్లో రవి నారాయణ్ పని చేశాడు. ఇంతకు ముందే మాజీ ముంబయి పోలీసు కమిషనర్ సంజయ్ పాండేను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఎన్‌ఎస్‌ఈ మరో చీఫ్ చిత్ర రామక్రిష్ణనూ ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమె ఇప్పటికే ఈడీ అదుపులోనే ఉన్నది. 

సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసు ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు ప్రారంభించింది.

న్యూఢిల్లీకి చెందిన ఐఎస్ఈసీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు, డైరెక్టర్లపైనా ఈడీ కేసు ఉన్నది. సంతోష్ పాండే, ఆనంద్ నారాయణ్, అర్మాన్ పాండే, మనీష్ మిట్టల్, నమన్ చతుర్వేది, ముంబయి పోలీసు కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ రవి  నారాయణ్, చిత్ర రామకృష్ణ, రవి వారణాసి (అప్పటి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) సహా ఇతరులు అని ఆ పిటిషన్ పేర్కొంది.

ఎన్ఎస్ఈ ఉద్యోగల టెలిఫోన్‌లను అక్రమంగా ట్యాప్ చేశారని హోం వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాచారంతో కేసు ఫైల్ అయింది. ఎన్ఎస్ఈ టాప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కై ఈ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు కథనాలు పేర్కొంటున్నాయి.

2009 నుంచి 2017 మధ్య కాలంలో ప్రైవేటు కంపెనీ ఓ కుట్రపూరితంగా, అక్రమంగా ఎన్ఎస్ఈ ఉద్యోగల టెలిఫోన్‌లను ట్యాప్ చేసిందని సీబీఐ గతంలో పేర్కొంది. పీరియాడిక్ సర్వే ఆఫ్ సైబర్  వల్నరబిలిటీస్ కార్యక్రమాన్ని చేపట్టి వారి ఫోన్‌లను ట్యాప్ చేసింది. ఆ ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా పనులు ఉండటానికి ముందుగానే సంస్థ టాప్ అఫీషియల్స్‌తో కుమ్మక్కు అయింది.

click me!