ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు కాలం చెల్లింది!

First Published Jun 19, 2018, 10:11 AM IST
Highlights

ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ గట్టి నిర్ణయం తీసుకోనుంది.

ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ గట్టి నిర్ణయం తీసుకోనుంది. పెళ్లి చేసుకున్న ఏడు రోజుల్లోగా ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) పెళ్లిళ్లను అధికారికంగా నమోదు చేసుకోవాలని, అలా చేయని పక్షంలో వారికి పాస్‌పోర్టులు, వీసాలు జారీచేయబోమని కేంద్రం స్పష్టం చేసింది.

విదేశాల్లో ఉంటూ, తమ విలాసవంతమైన జీవనశైలితో ఇక్కడి వారిని ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితభాగస్వామిని వదిలివేయటం లేదా వారిని వేధించడం వంటి పలు ఉదంతాలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్ఆర్ఐ భర్తలు తమను వేధిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని నియమించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ల ఆధ్వర్యంలో ఈ కమిటీ నియామకం కానుంది.

ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటే, ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత ఎంతో అవసరమని ఈ కమిటీ అభిప్రాయపడింది. అందుకే వివాహం జరిగినప్పటి నుంచి ఏడురోజుల్లోగా తప్పనిసరిగా ఆ పెళ్లిని అధికారికంగా నమోదు చేసుకోవాలని ఈ కమిటీ పేర్కొంది. వీటన్నింటినీ ధిక్కరించి ఎవరైనా అక్రమాలకు పాల్పడాలని చూస్తే, ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.

ఇందులో భాగంగా, వివాదాస్పదమైన ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు, మోసం చేసి పారిపోయిన భర్తల విషయంలో వారి ఆస్తులను ఎస్క్రో పరిధిలోకి తీసుకురావాలని ఈ కమిటీ ప్రతిపాదించింది.  ఎస్క్రో అంటే ఆ వివాదం తేలేవరకు అందులో అభియోగాలు ఎదుర్కుంటున్న వారి అస్తులన్నింటినీ థర్డ్ పార్టీ ఆధీనంలో ఉంచడం జరుగుతుంది.

click me!