ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక‌ల గెలుపుపై బీజేపీ న‌జ‌ర్.. అభ్యర్థుల ఎంపిక కోసం కీలక సమావేశం

By Mahesh RajamoniFirst Published Jan 25, 2023, 5:07 PM IST
Highlights

New Delhi: మూడు ఈశాన్య రాష్ట్రాలకు అభ్యర్థుల ఎంపిక కోసం శుక్రవారం బీజేపీ కీలక సమావేశం నిర్వ‌హించ‌నుంది. వచ్చే నెలలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో జరిగే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు నిరాక‌రించే అవకాశం ఉందని సమాచారం.
 

northeast states Elections: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా స‌హా బీజేపీ అగ్ర‌నేత‌లు హాజరుకానున్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో జరిగే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి పార్టీ  టిక్కెట్టు నిరాక‌రించే అవకాశం ఉందని సమాచారం.

ప్ర‌స్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. త్రిపురలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిగిలిన రెండు రాష్ట్రాలు మేఘాల‌య‌, నాగాలాండ్ ల‌లో ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. త్రిపురలో అధికార వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలను ఎదుర్కొనేందుకు బీజేపీ గత ఏడాది ముఖ్యమంత్రిని మార్చింది. రాష్ట్రంలో విప్లబ్ దేవ్ స్థానంలో మాణిక్ సాహా బాధ్యతలు చేపట్టారు. మేఘాలయలో 2018లో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీ కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈసారి ఒంటరిగా పోటీ చేసి సొంతంగా మరిన్ని విజయాలు సాధించాలని భావిస్తోంది.

నాగాలాండ్ లో 2018లో బీజేపీ 12 సీట్లు గెలుచుకుని నీఫియు రియో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈసారి ఆ పార్టీ ఎన్డీపీపీతో పొత్తును కొనసాగించనుంది. మొత్తం 60 స్థానాలకు గాను ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే, రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర నేతలు నిరసన వ్యక్తం చేస్తూ 50-50 ప్రాతిపదికన పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 16న త్రిపుర, ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్ ల‌లో ఎన్నికలు జరగనున్నాయి.
 

click me!