రెండు కంపెనీలనే నమ్ముకుంటే.. ఎప్పటికి పూర్తవ్వాలి: వ్యాక్సినేషన్‌పై కేజ్రీవాల్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 11, 2021, 2:34 PM IST
Highlights

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రెండు కంపెనీలే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని, నెలకు 6 నుంచి 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఆ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని కేజ్రీవాల్ అన్నారు. 

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రెండు కంపెనీలే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని, నెలకు 6 నుంచి 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఆ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని కేజ్రీవాల్ అన్నారు.

ఇదే తరహాలో అయితే, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్లు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటికీ చాలా 'వేవ్‌లు' వస్తాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని, అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నేషనల్ ప్లాన్ రూపొందించాలని ఆయన కేంద్రానికి సూచించారు.

కేవలం రెండు కంపెనీలపైనే వ్యాక్సిన్ తయారీకి ఆధారపడకుండా, ఈ రెండు కంపెనీల నుంచి కేంద్రం ఫార్ములా సేకరించి, సురక్షితంగా వ్యాక్సిన్ తయారీ చేయగల ఇతర కంపెనీలకు ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. క్లిష్టకాలంలో కేంద్రానికి ఇలాంటి అధికారం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఒరిజినల్ వ్యాక్సిన్ తయారీదారులకు రాయల్టీగా చెల్లించాలన్నారు.

Also Read:ఇండియాలో కరోనా జోరు: 24 గంటల్లో 3876 మంది మృతి

కాగా, ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ప్రజల సహకారంతో లాక్‌డౌన్ విజయవంతమైందని ఆయన అన్నారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో ఆక్సిజన్ పడకల సంఖ్య పెంచామని, సోమవారంనాడు జీటీబీ ఆసుపత్రి సమీపంలో 500 కొత్త పడకలు ప్రారంభించామని, ప్రస్తుతం ఢిల్లీలో ఐసీయూ, ఆక్సిజన్ పడకల కొరత లేదని చెప్పారు.

రాష్ట్రంలో రోజుకు 1.25 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. త్వరలోనే ప్రతిరోజూ 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామన్నారు. రాబోయే మూడు నెలల్లో ఢిల్లీవాసులందరికీ వ్యాక్సిన్ వేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కొరత అయితే ఉందని, ప్రస్తుతం కొద్దిరోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

click me!