సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

By telugu teamFirst Published Mar 7, 2020, 10:41 AM IST
Highlights

సినీ నటి, బిజెపి నాయకురాలు జయప్రదపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై ఆ వారంట్ జారీ అయింది.

రాంపూర్: ప్రముఖ సినీ నటి, బిజెపి నాయకురాలు జయప్రదపై ఉత్తర ప్రదేశ్ లోని ఓ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. లోకసభ ఎన్నికల సందర్భంగా నిరుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై కోర్టు ఆమెపై ఆ వారంట్ జారీ చేసింది. 

2019 లోకసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై 57 ఏళ్ల జయప్రదపై కేసు నమోదు చేశారు. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20వ తేదీన జరుగుతుంది.

రాంపూర్ లోకసభ స్థానం నుంచి జయప్రద సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజం ఖాన్ పై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. తొలుత ఆమె ఎస్పీలో ఉన్నారు. ఓసారి రాంపూర్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు కూడా.

జయప్రదను ఎస్పీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె బిజెపిలో చేరి రాంపూర్ నుంచి తిరిగి పోటీ చేశారు. రాంపూర్ నియోజకవర్గంలో ఆజం ఖాన్ కు, జయప్రదకు మధ్య మాటల యుద్ధం సాగింది.

జయప్రద పలు తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. తొలుత ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత ఎస్పీలోకి మారారు.

click me!