Coronavirus: క‌రోనా ఎఫెక్ట్.. అక్కడ మార్చి 31వ‌ర‌కు 144 సెక్ష‌న్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 1, 2022, 12:25 PM IST

Coronavirus: దేశంలోని ప‌లు ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే పాలు రాష్ట్రాల్లో క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. యూపీలోని నోయిడా, గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్ లో మార్చి 31 వ‌ర‌కు 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. 
 


Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. క‌రోనా (Coronavirus)మ‌హ‌మ్మారి సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. అయితే, కొత్త‌గా రోజువారీ (Coronavirus) కేసులు త‌గ్గుతుండ‌గా, కోవిడ్-19  మరణాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ క‌రోనా వైర‌స్ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న గౌత‌మ్ బుద్ధ న‌గ‌ర్ లో జిల్లా యంత్రాంగం 144 సెక్ష‌న్ విధించింది. గౌత‌మ్ బుద్ద న‌గ‌ర్‌, నోయిడాల‌లో క‌రోనా వ్యాప్తిని నియంత్రించ‌డానికి మరిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. 144 సెక్ష‌న్ స‌హా మ‌రిన్ని ఆంక్ష‌లు మార్చి 31 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా, అంతకుముందు డిసెంబర్‌లో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి  ఇక్క‌డ 144 సెక్షన్ విధించారు.  

Latest Videos

undefined

తాజాగా జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో క‌రోనా ఆంక్ష‌లు మార్చి 31 వ‌ర‌కు కొన‌సాగుతాయని పేర్కొంది. ఫేస్ మాస్క్‌లు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. ప్ర‌జ‌లు శానిటైజేషన్ చ‌ర్య‌ల‌ను పాటించాల‌నీ, సామాజిక దూరం లేకుండా, బహిరంగంగా గుమిగూడడంపై  నిషేధం కొన‌సాగుతుంద‌ని తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు  నైట్ కర్ఫ్యూ  అమ‌ల్లో ఉంటుంది.  అయితే, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. వివాహాల‌కు గ‌రిష్టంగా 100 మంది హాజ‌రు కావ‌డానికి అనుమ‌తించారు. బ‌హిరంగా ప్ర‌దేశాల్లో అయితే, 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. దీనికి ముందుగానే అధికారుల నుండి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. అనుమ‌తులు లేకుండా నిరసనలు, ఊరేగింపులపై నిషేధం విధించారు. 

ఎన్నిక‌ల కొన‌సాగుత‌న్న‌ప్పటికీ.. ఫిబ్రవరి 11, 2022 వరకు ఎలాంటి రోడ్‌షోలు, ర్యాలీలు, పాదయాత్రలు లేదా బైక్ ర్యాలీలు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి లేదు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో 20 మందిని మాత్రమే అనుమతించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 మంది కంటే ఎక్కువ మంది సమూహాలలో సమావేశమవ్వకూడదు. ఆదేశాల‌ను ఉల్లంఘించిన వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇదిలావుండ‌గా, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 6,626 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 20,19,549కి చేరుకున్నాయి. కొత్త‌గా మరో 18 మంది చ‌నిపోవ‌డంతో మరణాల సంఖ్య 23,207కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,41,506కి చేరుకుంది. ప్ర‌స్తుతం 54,836 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇదిలావుండగా, కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,67,059 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య  4,14,69,499 కి పెరిగింది.  ప్ర‌స్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా వైర‌స్ బారినుంచి 2,54,076 మంది కోలుకున్నారు. మొత్తం క‌రోనా రిక‌వ‌రీల సంఖ్య 3,92,30,198కి చేరింది. ఇదే సమయంలో కొత్త‌గా క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1,192 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇప్పటివ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 4,96,242కు పెరిగింది.

click me!