కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, దానిని ఎవరూ అడ్డుకోలేరని యడియూరప్ప అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో మరో సారి అధికారం చేపడుతుందని ఆయన ధీమ ా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది బీజేపీని వీడటం వల్ల లింగాయత్ మద్దతుపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో సారి కూడా రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని ఆయన ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుదాం - రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్
జగదీష్ శెట్టర్ కు బీజేపీ ఎన్నో పదవులు ఇచ్చిందని యడియూరప్ప అన్నారు. సీఎంగా, ప్రతిపక్ష నేతగా, స్పీకర్ గా నియమించిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఇస్తామని చెప్పామని, ఆయన సతీమణికి (హుబ్లీ - ధార్వాడ్ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు) టికెట్ ఇస్తామని చెప్పామని తెలిపారు. అయినా ఆయన మొండిగా వ్యవహరించి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారని చెప్పారు. ప్రజలెవరూ ఆయన నిర్ణయాన్ని సమర్థించరని, రెండు రోజుల తరువాత ఆ ప్రాంతం నుంచే తన పర్యటన ప్రారంభించి అందరికీ వాస్తవాలు వివరిస్తానని అన్నారు.
సవాది ఎన్నికల్లో (2018లో) ఓడిపోయారని, అయినా పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేసిందని తెలిపారు. అయినా ఆయన పార్టీని వీడి నమ్మక ద్రోహం చేశారని తెలిపారు. ప్రజలు శెట్టర్, సవదిని క్షమించరని అన్నారు. కేవలం అధికారం కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లింగాయత్ సామాజిక వర్గం మద్దతు కూడగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. ఏవైనా అపోహలు ఉంటే వారిని ఒప్పించే ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
తాము పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యడియూరప్ప అన్నారు. తాము 125 సీట్లు గెలుస్తామని, అధికారం చేపడుతామని, దీనిని ఎవరూ ఆపలేరని తెలిపారు. ఇప్పుడున్న వాతావరణం, జాతీయ నేతల పర్యటన తర్వాత మరో 10-12 రోజుల్లో బీజేపీకి అనుకూలంగా మారుతుంది. ముగ్గురు బీజేపీ నాయకులు పార్టీని వీడారని, కానీ కార్యకర్తలు తమను వీడలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒకరిద్దరు మినహా తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా గెలుస్తారని అన్నారు.
విషాదం.. రైస్ మిల్ బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది..? ఎక్కడంటే ?
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.