
బీహార్ దారుణం జరిగింది. కోవిడ్ బారిన పడిన భర్తకు చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకువచ్చిన మహిళ మీద ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాట్నా, మయాగంజ్ లోని గ్లోకల్ హాస్పిటల్, రాజేశ్వర్ హాస్పిటల్, భగల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తన మీద లైంగిక దాడి జరిగిందని.. ఆస్పత్రుల్లో సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ప్రాణాలు పోయాయంటూ ఓ బాధితురాలు విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ మేరకు ఆమె 12 నిమిషాల వీడియోను రిలీజ్ చేసింది. దీంట్లో డాక్టర్లు, సిబ్బంది, మూడు ఆస్పత్రుల మీద ఆమె ఆరోపణలు చేసింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా తన భర్తను చూడడానికి నిరాకరించారని, అతని మంచం మీదున్న మురికిదుప్పట్లు మార్చడానికి కూడా నిరాకరించారని తెలిపింది.
COVID-19 చికిత్సలో ఉపయోగించే అత్యంత ఖరీదైన, కష్టసాధ్యమైన యాంటీవైరల్ ఔషధమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ సగం సీసాను భగల్పూర్ ఆసుపత్రిలోని సిబ్బంది వృధా చేశారని ఆమె ఆరోపించారు.
‘మేము నోయిడాలో ఉంటాం. హోలీ పండుగ కోసం కుటుంబమంతా బీహార్ లో కలిశాం. ఏప్రిల్ 9న ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రంగా జ్వరం వచ్చింది. రెండుసార్లు కరోనావైరస్ టెస్ట్ చేయించాం. అయితే అది నెగెటివ్ వచ్చింది. RT-PCR పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, ఒక నోయిడా డాక్టర్ ఛాతీ CT చేయించమని చెప్పారు’ అని ఆమె అన్నారు.
‘స్కానింగ్ లో ఊపిరితిత్తుల్లో 60 శాతం ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు చూపించింది. వెంటనే మరుసటి రోజు నా భర్త, మా అమ్మ భాగల్పూర్ గ్లోకల్ ఆసుపత్రిలో చేరారు. మేమే వారికి అడ్మిట్ చేశాం. మా అమ్మ కూడా అనారోగ్యంతో ఐసీయూలో ఉంది. అయితే అక్కడ చాలా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. డాక్టర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. అటెండెంట్స్ ఉండేవాళ్లు కాదు. మందులు ఇచ్చేవాళ్లు కాదు. మా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగే కానీ, నా భర్త పరిస్థితి దారుణంగా తయారవుతోంది. మాట్లాడలేకపోతున్నాడు. దాహం అని నీళ్ల కోసం సైగలు చేస్తున్నారు. కానీ ఎవ్వరూ అతనికి నీళ్లు ఇవ్వడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
‘గ్లోకల్ హాస్పిటల్ లో జ్యోతి కుమార్ అనే అటెండెంట్ ఉన్నాడు. అతన్ని సాయం అడిగాను. నా భర్త బెడ్ షీట్లు మార్చమని, దాహం ఇవ్వమని అడిగాను. నాకు సాయం చేయడానికి అతను ఒప్పుకున్నాడు. కానీ నేను నా భర్తతో మాట్లాడుతున్నప్పుడు.. నా దుప్పట్ల ఒక్కసారిగా లాగినట్టు అనిపించింది. నేను గుండ్రంగా తిరిగాను. అతను నా నడుంమీద చేయి వేసి ఓరగా నవ్వుతూ చూస్తున్నాడు. నేను దుపట్టాను వెనక్కి లాక్కున్నాను. ఏమైనా అనడానికి నేను భయపడ్డాను. నా భర్త, నా తల్లి ఇక్కడ ఉన్నారు. నేనేదైనా గొడవ స్తే వారికి వారికి ఏదైనా చేస్తారు' అని అనుకున్నాను.
ఈ ఆరోపణలపై విచారణ కోసం స్థానిక ప్రభుత్వ అధికారులు హాస్పిటల్ సందర్శించారు. ఆ తరువాత గ్లోకల్ హాస్పిటల్ నిందితుడైన ఉద్యోగిని సస్పెండ్ చేసింది.
అక్కడినుంచి ఆమె భర్తను మయగంజ్, పాట్నాలోని ఆసుపత్రులకు రిఫర్ చేశారు. అక్కడ జరిగిన మరింత షాకింగ్ అనుభవాల గురించి ఆమె కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడింది.
భగల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మయగంజ్లో, నైట్ షిఫ్టులో ఉన్న వైద్యులు తను, తన సోదరి ఎంత విజ్ఞప్తి చేసిన తన భర్తను చూడడానికి, అతనికి ఆక్సిజన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారని ఆమె పేర్కొన్నారు.
పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు భర్తకు ఆక్సిజన్ స్థాయిలు బాగా పడిపోయాయి. ఈ విషయం చెప్పినప్పటికీ సిబ్బంది చాలా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు. ఆ తరువాత ఆక్సీజన్ స్టైబుల్ అయ్యాక.. ఆక్సీజన్ సరఫరాను తగ్గించారు. దీంతో బ్లాక్ మార్కెట్ నుండి సిలిండర్లను కొనుగోలు చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు.
సెకండ్ వేవ్ లో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాలలో బీహార్ కూడా ఒకటి. గత 24 గంటల్లో అధికారికంగా 11,000 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా ఉంది.