కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. నన్ను గృహనిర్బంధం చేశారు: మాజీ సీఎం ముఫ్తీ

By telugu teamFirst Published Sep 7, 2021, 12:17 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, వేర్పాటువాద నేత గిలానీ మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సహా పలు ఆంక్షలను ఎత్తేసినట్టు జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. కానీ, ఈ వాదనను తప్పుపడుతూ జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, తనను గృహనిర్బంధం చేశారని వెల్లడించారు.

శ్రీనగర్: రెండేళ్లుగా జమ్ము కశ్మీర పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆంక్షల మధ్య జనజీవనం దుర్భరంగా మారిందని కొన్ని నివేదికలు వెల్లడిస్తుండగా కేంద్ర ప్రభుత్వం కొట్టేసింది. తాజాగా, వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత కశ్మీర్ లోయలో మళ్లీ ఆంక్షలు విధించినట్టు తెలిపిన కేంద్రం నేడు ఇంటర్నెట్ సేవలపై సహా ఇతర ఆంక్షలూ ఎత్తేసినట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కానీ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మాత్రం ఆ వాదనలను ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదానికి కశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని మెహబూబా ముఫ్తీ తెలిపారు. తనను గృహనిర్బంధం చేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రజల హక్కుల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నదని, కానీ, కశ్మీరీలకు అవే హక్కులు అందకుండా కాలరాస్తున్నదని ఆరోపించారు. ఇవాళ తనను ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండా నిర్బంధించారని తెలిపారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ శాంతి వాదనలను ఈ పరిస్థితులు తప్పని వెల్లడిస్తున్నాయని ట్వీట్ చేశారు.

కశ్మీర్‌లో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత ముందు జాగ్రత్తగా అధికారులు ఆంక్షలు విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సహా పలు సేవలపై ఆంక్షలు వేశారు. ఉగ్రకార్యకలాపాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో  ఈ నిర్ణయం తీసుకున్నారు. గిలానీ నివాస ప్రాంతంలోనూ భారీగా బలగాలను మోహరింపజేశారు. కానీ, గిలానీ మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆంక్షలు ఎత్తేసినట్టు తాజాగా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదు రోజులుగా ఇక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు వ్యవహరించిన తీరు అమోఘమని ప్రశంసించారు.

click me!