దీపావళి ఆఫర్.. వారంపాటు ట్రాఫిక్ ఛలాన్లు లేవు.. ఫైన్లు లేవు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

By Mahesh KFirst Published Oct 22, 2022, 2:19 PM IST
Highlights

దీపావళి సందర్భంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా జరిమానాలు వేయరాదనే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు గుజరాత్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఫైన్లు పడవు. అంతేకాదు, వారికి పోలీసులు పూవులు ఇచ్చి నిబంధనలు పాటించాలని సర్ది చెబుతారని ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ మంత్రి వివరించారు.
 

అహ్మదాబాద్: దీపావళి కోసం దేశమంతా సిద్ధం అవుతున్నది. రంగోలీలు, దీపాలు, పటాసులు, ఇంటికి కొత్త రంగులతో ప్రజలతో హడావిడిలో మునిగిపోనున్నారు. ఈ పండుగ సీజన్‌లో మార్కెట్ కూడా కొత్త కొత్త ఆఫర్లతో కవ్విస్తూ ఉంటుంది. దీపావళి రోజున షాపింగ్ చేసి బంపర్ ఆఫర్‌లను మిస్ చేసుకోవద్దని ఉబలాటపడతారు. ఇదంతా మార్కెట్ ఆఫర్.. కానీ, ఆ రాష్ట్రం ప్రభుత్వం తరఫున ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీపావళి సందర్భంగా వారం రోజుల పాటు వాహనదారులకు ఎలాంటి ఫైన్లు వేయమని ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఛలాన్లు వేయబోమని వెల్లడించింది.

దీపావళి సందర్భంగా అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఫైన్లు వేయకూడదని గుజరాత్ సీఎం భుపేంద్ర పటేల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని గుజరాత్ హోం మినిస్టర్ హర్ష్ సంఘవి వెల్లడించారు. సీఎం భుపేంద్ర పటేల్ మరో ప్రజా పక్ష నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 

ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Also Read: దీపావళి, ధన్‌తేరాస్‌ రోజున మీ డ్రీమ్ కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ కార్ల గురించి తెలుసుకోండి

‘ఈ నిర్ణయాన్ని చట్టాన్ని ఉల్లంఘించడానికి వాడుకోరాదు’ అని మంత్రి హర్ష్ సంఘవి సూచనలు చేశారు. ‘ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, గుజరాత్ పోలీసులు వారికి పువ్వులు ఇచ్చి అలా చేయరాదని సర్ది చెబుతారు’ అని తెలిపారు. దీపావళి అంటే దీపాల పండుగ.. రంగు రంగుల రంగోలీ, స్వీట్లు, క్రాకర్స్.. మరెన్నో ఉత్తేజకరమైన అంశాలు వెంట తీసుకుని వస్తుందని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తున్నది. కొందరు ఈ నిర్ణయాన్ని ట్విట్టర్‌లో స్వాగతించారు. మరికొందరు అభ్యంతరం తెలిపారు. ట్రాఫిక్ నిబందనలు స్వచ్ఛందంగా పాటించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ఈ నిర్ణయం కారణంగా ట్రాఫిక్ మరింత దారుణంగా దిగజారిపోతుందని కామెంట్లు చేశారు.

Also Read: దివాళి 2022: మీరు డయాబెటీస్ పేషెంట్లా.. ఇదిగో ఈ దీపావళికి మీరు తినగలిగే షుగర్ ఫ్రీ స్వీట్లు ఇవే..

ఒక రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి వాహనాలను చూడు అంటూ ఒకరు మంత్రికి సూచనలు చేశారు. ఈ నిర్ణయం సరికాదని, చట్టం అంటే ఇక ఎవరూ భయపడరని ఇంకొకరు కామెంట్ చేశారు. దీని ఫలితంగా యాక్సిడెంట్ల రేటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మరికొందరు ప్రజా పక్ష నిర్ణయమే అయితే.. మొత్తంగానే ట్రాఫిక్ జరిమానాలు ఎత్తేయడం మంచిది కదా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

click me!