Jahangirpuri Demolition - మేం ఆదేశించిన తరువాత కూడా కూల్చివేతలా??

Published : Apr 21, 2022, 02:22 PM IST
Jahangirpuri Demolition - మేం ఆదేశించిన తరువాత కూడా కూల్చివేతలా??

సారాంశం

తాము ఆదేశించిన తరువాత కూడా జహంగీర్ పురిలో కూల్చివేతలు కొనసాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రెండు వారాల వరకు యధాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 


ఢిల్లీ :  రాజధాని నగరంలోని Jahangirpuriలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ లో స్థానిక అధికారులు వ్యవహరించిన తీరును గురువారం supreme court తప్పుపట్టింది. కూల్చివేత ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించిన తర్వాత కూడా దానిని కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ‘సుప్రీమ్ కోర్టు నిర్ణయాన్ని మేయర్ కు తెలియజేసిన తర్వాత జరిగిన అన్ని కూల్చివేతలను మేము తీవ్రంగా పరిగణిస్తాం. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ యథాతథస్థితిని కొనసాగించాలి’ అంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీ జహంగీర్ పురి ప్రాంతంలో  బుధవారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ డీఎంసీ)  హడావుడిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం కలకలం రేపింది. బుల్డోజర్ లను ఉపయోగిస్తూ కొన్ని నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేయగా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము గురువారం విచారణ చేపడతామని అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్దేశించింది.

అయినా, గంటన్నర వరకు  అక్కడ కూల్చివేతలు ఆగలేదు. న్యాయస్థానం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు అందక పోవడమే అందుకు కారణమని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఆ విషయాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రస్తావించారు. వెంటనే స్పందించి జస్టిస్ ఎన్వీ రమణ కూల్చివేతలను ఆపాల్సిందిగా తాము  ఆదేశించిన సంగతిని సంబంధిత అధికారులకు సత్వరం తెలియజేయాలని కోర్టు సెక్రటరీ జనరల్ కు సూచించారు. ఆ తరువాత డ్రైవ్ను నిలిపివేసినట్లు  ఎన్ డిఎంసి  మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు.

కాగా, విచారణలో భాగంగా పిటిషనర్లు కోర్టులో తమ వాదనలు వినిపించారు. రాము పత్రాలు చూపించినా కూల్చివేతలు ఆపలేదని,  తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరో పక్క చిన్నపాటి నిర్మాణాలను మాత్రమే తొలగించామని స్థానిక యంత్రాంగం వాదించగా..  దానికి బుల్డోజర్లు ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ కూల్చివేతపై మున్సిపల్ కార్పొరేషన్, డిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా, బుధవారం దేశ రాజధాని నగరం ఢిల్లీలోని Jahangirpuriలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చర్యలు ప్రారంభించింది. దీనిపై supreme court కలగజేసుకుని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ను వెంటనే నిలిపివేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.  అలాగే దీనికి సంబంధించిన విచారణను రేపు చేపడతామని తెలిపింది.  మరోపక్క స్థానిక యంత్రాంగంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.

ఇటీవల జహంగీర్ పూరిలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చి వేయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా సదర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు లేఖ రాశారు.  ఆ తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభమైంది. ఈ డ్రైవ్ రోజువారీ కార్యకలాపాలలో భాగమేనని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు.  ఈ లేఖ రాసిన సమయంలో ఈ చర్యలు చేపట్టడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా..  సుప్రీం ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియను నిలిపివేస్తామని  ఇక్బాల్ వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?