
Delhi University: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) శతాబ్ది ఉత్సవాలల్లో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకలకు డీయూ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతలో ఎలాంటి లోపం తలెత్తకుండా ఉండేందుకు కొద్ది రోజుల ముందే భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ శతాబ్ది ఉత్సవాల పాల్గొనే విద్యార్థులకు, అధ్యాపకులకు ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశాయి. ప్రధాని మోదీ పాల్గొనే శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, ఉత్సావాల్లో నల్లటి దుస్తులు ధరించరాదని ఆదేశించారు. అలాగే.. ఢిల్లీలోని హిందూ కళాశాల, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాల , జాకీర్ హుస్సేన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా ప్రధాని ఈవెంట్ కు హాజరు కావాలని మార్గదర్శకాలు జారీ చేశారు..
ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనే విద్యార్థులు తమ ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలని, సమావేశానికి గంటన్నర ముందుగా రావాలని అంటే ఉదయం 8:50 నుండి ఉదయం 9 గంటల వరకు కళాశాలలో ప్రవేశించాలి, కార్యక్రమానికి హజరయ్యే విద్యార్థులు నల్ల దుస్తులు ధరించకూడదని హిందూ కళాశాల ఉపాధ్యాయుడు-ఇన్‌చార్జ్ మీను శ్రీవాస్తవ నోటీసులో తెలిపారు. కానీ, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ మాత్రం అటువంటి పరిపాలన నోటీసులను జారీ చేయలేదని చెప్పారు. లైవ్ టెలికాస్ట్ గురించి విద్యార్థులకు, అధ్యాపకులందరికీ తాను మెయిల్ చేసాననీ, దానికి హాజరు కావాలని వారిని కోరాననీ, హాజరు తప్పనిసరి కాదని ప్రిన్సిపాల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాలలో జరిగే లైవ్ వెబ్ టెలికాస్ట్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను యూనివర్సిటీకి అందజేస్తామని చెప్పారు.
ఢిల్లీ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా తాము హాజరు తప్పనిసరి చేయలేదని స్పష్టం చేసింది, ఈవెంట్‌కు రాలేని వారు దానిని చూసేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తప్పనిసరి హాజరుపై వర్సిటీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని రిజిస్ట్రార్ వికాస్ గుప్తా తెలిపారు.
అలాగే..రాంజాస్ కాలేజ్, మిరాండా హౌస్, కిరోరిమల్ కాలేజ్ కూడా తమ హాజరును తప్పనిసరి చేయలేదని, అయితే విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారమని తెలిపారు.మిరాండా హౌస్ ప్రిన్సిపాల్ బి నందా, రాంజాస్ కాలేజీ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ ఖన్నా, కిరోరిమల్ కాలేజీ ప్రిన్సిపాల్ దినేష్ ఖట్టర్ కూడా ప్రధాని కార్యక్రమానికి హాజరు తప్పనిసరి కాదని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా ఉన్నారని తాము విశ్వవిద్యాలయానికి తెలియజేసామనీ, అందుకే ప్రత్యక్ష ప్రసారం చేస్తామని బదులిచ్చారని తెలిపారు. విద్యార్థులు స్వయంగా చాలా ఆసక్తిగా ఉన్నారనీ, తాము ఎవరిని బలవంతం పెట్టడం లేదని మిరాండా హౌస్ ప్రిన్సిపాల్ బి నందా తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) శతాబ్ది వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అదే సమయంలో డీయూలో మూడు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనాలను ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ కోసం కేటాయించనున్నారు. వచ్చే రెండేళ్లలో మూడు భవనాలు పూర్తవుతాయి. లోగో బుక్‌తో సహా మూడు కాఫీ టేబుల్ పుస్తకాలను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి విద్యార్థులు అందరూ తప్పకుండా హాజరు కావాలని, నల్లరంగు దుస్తులు ధరించరాదనే నిబంధన విధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.