Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లేదు.. వచ్చే వారానికి తీర్పు వాయిదా

By telugu teamFirst Published Oct 14, 2021, 5:17 PM IST
Highlights

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్‌ విచారణపై దేశమంతా ఆసక్తిగా చూస్తున్నది. రెండో రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ అప్లికేషన్‌పై వాదనలు జరిగాయి. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత ముంబయి సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే బుధవారం తీర్పు వెల్లడించనుంది. అప్పటి వరకు ఆర్యన్ ఖాన్ జైలులోనే ఉండబోతున్నారు.
 

ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ Shah Rukh Khan తనయుడు Aryan Khan బెయిల్ విచారణపై దేశమంతా ఆసక్తిగా చూస్తున్నది. ముంబయిలోని ముంబయి సెషన్స్ కోర్టులో bail వాదనలు జరుగుతున్నాయి. నిన్న ఎన్‌సీబీ అధికారులు, ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ హోరాహోరీగా వాదనలు వినిపించారు. ఈ రోజు కూడా వాదనలు వినిపించారు. అడ్వకేట్ అమిత్ దేశాయ్ తన వాదనలను ముగించారు. తన క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరముందని బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును వచ్చే బుధవారానికి అంటే 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆర్యన్ ఖాన్ jailలో ఉండబోతున్నారు.

ఆర్యన్ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, ఆయన మిత్రుడు అర్బాజ్ ద్వారా డ్రగ్స్ పొందేవాడని, తరుచూ ఆయన మాదకద్రవ్యాలను తీసుకునేవాడని NCB అధికారులు కోర్టుకు తెలిపారు. రెగ్యులర్‌గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తాడని బలంగా చెప్పడంతో వాదనలు వేడెక్కాయి. అందుకే నిన్నటితో వాదనలు ముగిసిపోలేవు. మళ్లీ ఈ రోజు జరిగాయి.

Also Read: అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఆర్యన్ ఖాన్‌కు సంబంధాలు: ఎన్‌సీబీ.. ‘డ్రగ్స్ కొనేందుకూ డబ్బులే లేవు’

ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ద్వారా ఆయన డ్రగ్స్ ఏళ్లుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై  అడ్వకేట్ అమిత్ దేశాయ్ మండిపడ్డారు. వాట్సాప్ సందేశాలు బలహీనమైన సాక్ష్యాధారలని, అవి ప్రైవేటు సందర్భంలో చేసుకునేవని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ సందేశాలను సాకుగా చూసి ఆ బాలుడి స్వేచ్ఛను హరించవద్దని కోర్టును కోరారు. కావాలంటే దర్యాప్తునకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండేలా షరతులు విధించడని సూచించారు. ఈ సందర్భంలో ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి కారణాల్లేవని, కచ్చితంగా ఆయన బెయిల్‌కు అర్హుడని వాదించారు. ఆర్యన్ ఖాన్‌కు ఇది వరకు నేరచరిత కూడా లేదని అన్నారు.

ఇప్పుడు తన క్లయింట్ ఆర్యన్ ఖాన్ నిర్దోషి అని చెప్పే దశలో కేసు లేదని, కానీ, బెయిల్ మంజూరు చేయడంలో ఆటంకాలు లేవని న్యాయవాది అమిత్ దేశాయ్ వివరించారు. బెయిల్ తర్వాత ఇంకా చాలా విషయాలను పరిశీలించాల్సి ఉన్నదని, దర్యాప్తు చేయాల్సి ఉన్నదని, అప్పటి వరకు ఈ బాలుడిని జైలులో ఉంచడం సరికాదని తెలిపారు. ఇప్పుడు తాను వాదించేది ఆ బాలుడి స్వేచ్ఛ.. స్వేచ్ఛ.. స్వేచ్ఛ గురించేనని అన్నారు. 

Also Read: Aryan Khan : టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందని.. తినకుండా, నీళ్లు తాగకుండా హఠం..

మనమంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం స్వాతంత్ర్యం కోసం పోరాడాం. పౌరుల హక్కులు, సమానత్వం కల్పించడానికి రాజ్యాంగం కోసం పోరాడాం అని అమిత్ దేశాయ్ తెలిపారు. కాబట్టి, చట్టానికి అతీతంగా చర్యలు తీసుకుని వారి హక్కులను గుర్తించకుండా ఉండటం సరికాదని వివరించారు. 

ఒకవేళ డ్రగ్స్‌కు బానిసలైనా వారిపట్ల సానుభూతిగా మెలగాలని ప్రభుత్వమే చెబుతున్నదని అమిత్ దేశాయ్ వివరించారు. ఎందుకంటే వారు స్వయంగా బాధితులని వాదించారు. ఈ సందర్భంలో తాను తన క్లయింట్ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పడం లేదని స్పష్టం చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోలేదని అన్నారు.  సెలెబ్రిటీలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీబీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ పేర్కొనడం సరికాదని అమిత్ దేశాయ్ అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని వాదించారు.

click me!