
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నేత గవర్నర్ ఫాగు చౌహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బిహార్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఎనిమిదో సారి. అదే సమయంలో బిహార్ డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి ముందు నితీష్ కుమార్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా సమాచారం. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు జరిగిన అన్ని రాజకీయ పరిణామాలను లాలూకు నితీష్ కుమార్ వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్బంగా లాలూ ప్రసాద్ యాదవ్.. నితీష్ కుమార్‌కు అభినందనలు చెప్పారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
ఇక, గత కొంతకాలంగా చోటుచేసకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఎన్డీయే కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం జేడీయూ ఎమ్మెల్యేల, ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ తర్వాత నితీష్ కుమార్ నేరుగా రబ్రీదేవి ఇంటికి చేరుకున్నారు. అక్కడ జేడీయూ, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహాకారం అందిస్తున్నందుకు నితీష్ కుమార్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఫోన్ చేసి థాంక్స్ చెప్పినట్టుగా సమాచారం.