బీహార్ అసెంబ్లీ విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ సర్కార్

By Sumanth KanukulaFirst Published Aug 24, 2022, 5:11 PM IST
Highlights

బీహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. అసెంబ్లీలో ఓటింగ్‌కు ముందు నితీష్ కుమార్ ప్రసంగిస్తున్న సమయంలో నిరసనగా బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.

బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. అసెంబ్లీ ఓటింగ్‌కు ముందు నితీష్ కుమార్ ప్రసంగిస్తున్న సమయంలో నిరసనగా బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక, నితీష్ కుమార్ సర్కార్ బల పరీక్షకు ముందు స్పీకర్ పదవికి బీజేపీ నేత‌ విజయ్‌ కుమార్‌ సిన్హా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న జేడీయూ నేత మహేశ్వర్ హజారీ బలపరీక్షకు అధ్యక్షత వహించారు.  విశ్వాస తీర్మానంపై చర్చ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ‘‘మీరంతా (బీజేపీ ఎమ్మెల్యేలు) పారిపోతున్నారా? నాకు వ్యతిరేకంగా మాట్లాడితేనే మీకు పార్టీలో స్థానం దక్కుతుంది. మీ అందరికీ మీ బాస్‌ల నుంచి ఆదేశాలు వచ్చి ఉండాలి’’ అని నితీష్ కుమార్ పేర్కొన్నారు. 

‘‘మేము (ఆర్‌జేడీ, జేడీయూ) బీహార్ అభివృద్ధికి కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు నాకు ఫోన్ చేసి అభినందించారు. 2024 ఎన్నికల్లో అందరూ కలిసి పోరాడాలని నేను కోరాను’’ అని నితీష్ కుమార్ చెప్పారు. 

డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. కొత్త భాగస్వామ్యం ‘‘చారిత్రాత్మకం’’ అని అన్నారు.‘‘ఇది ఎప్పటికీ ముగియని ఇన్నింగ్స్. ఇది చారిత్రాత్మకం. మా భాగస్వామ్యం చాలా కాలం ఉంటుంది. ఎవరూ రనౌట్ చేయబడరు’’ అని తేజస్వీ యాదవ్ చెప్పారు. 

చర్చ సందర్భంగా బీజేపీ నేత తారకిషోర్ ప్రసాద్.. నితీష్ కుమార్‌ను ‘‘రాజకీయ విశ్వసనీయత’’ కోల్పోయారని విమర్శించారు. సొంతంగా ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యం లేకపోయినా ప్రధానమంత్రి కావాలనే వ్యక్తిగత ఆశయం ఉందని ఎద్దేవా చేశారు. 

click me!