15 ఏండ్లు నిండిన వాహనాలకు స్వస్తి.. 9 లక్షలకు పైగా వాహనాలు స్క్రాప్ కి

By Rajesh KarampooriFirst Published Jan 31, 2023, 6:56 AM IST
Highlights

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా వాహనాలను.. ఏప్రిల్ 1 నుంచి రద్దు చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.  

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు పైబడిన 9 లక్షల ప్రభుత్వ వాహనాలను రద్దు చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకవస్తామని తెలిపారు. 

ఇథనాల్, మిథనాల్, బయో-సిఎన్‌జి, బయో-ఎల్‌ఎన్‌జి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ (FICCI)నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ అన్నారు. 15 ఏళ్లు దాటిన తొమ్మిది లక్షలకు పైగా వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు ఆమోదం తెలిపామని గడ్కరీ తెలిపారు. దీంతో పాటు కాలుష్యం వెదజల్లుతున్న బస్సులు, కార్లను రోడ్డుపై రానీయకుండా నిలిపివేస్తామనీ, వాటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని తెలిపారు. దీని వల్ల వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని గడ్కరీ చెప్పారు.

రిజిస్ట్రేషన్ రద్దు 

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 15 సంవత్సరాలు నిండిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలన్నీ ఏప్రిల్ 1 నుండి రిజిస్ట్రేషన్ రద్దు చేయబడతాయి. వీటిలో రవాణా సంస్థలు,ప్రభుత్వ రంగ సంస్థలలోని వాహనాలు ఉన్నాయి.

అయితే.. దేశ రక్షణ, శాంతి భద్రతల అమలు, అంతర్గత భద్రత కోసం కార్యకలాపాలలో ఉపయోగించే ప్రత్యేక ప్రయోజన వాహనాలకు (సాయుధ మరియు ఇతర ప్రత్యేక వాహనాలు) ఈ నియమం వర్తించదు. ఇందులో.. అటువంటి వాహనాలు మోటారు వాహనాల (రిజిస్ట్రేషన్ అండ్ వెహికల్స్ స్క్రాప్ యూనిట్) రూల్స్, 2021 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన రోజు నుండి 15 సంవత్సరాల తర్వాత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ యూనిట్ ద్వారా పారవేయబడతాయి.

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన

యూనియన్ బడ్జెట్ 2021-22లో ప్రకటించిన పాలసీలో ప్రైవేట్ వాహనాలకు 20 ఏళ్ల తర్వాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు అవకాశం ఉంది. ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చే కొత్త విధానం ప్రకారం.. పాత వాహనాలను రద్దు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వాహనాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రహదారి పన్నులో 25 శాతం వరకు మినహాయింపు ఉంటుందని కేంద్రం తెలిపింది. 

150 కిలోమీటర్లలోపు ప్రతి నగరంలో కనీసం ఒక ఆటోమొబైల్ స్క్రాపింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు గడ్కరీ గత సంవత్సరం చెప్పారు. దేశం మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో వాహనాల స్క్రాపింగ్ హబ్‌గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు. దీని వల్ల ఫిట్‌నెస్ లేని, కాలుష్య కారక వాహనాలను తొలగించేందుకు వీలవుతుందని తెలిపారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని భావిస్తున్నారు. 

click me!