నితిన్ గడ్కరీ, ఫడ్నవీస్ సొంత గడ్డలో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీగా ఎంవీఏ అభ్యర్థి విజయం

By Asianet NewsFirst Published Feb 3, 2023, 10:10 AM IST
Highlights

మహారాష్ట్రలో ఇటీవల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ఓ స్థానంలో ఎంవీఏ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ కు బలమైన పట్టు ఉంది. అయినప్పటికీ బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. 

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కంచుకోటగా భావించే ఓ స్థానం నుంచి బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి చెందిన ఓ అభ్యర్థి గెలుపొందారు. ఆ ప్రాంతంలో బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖ నాయకుల సొంతగడ్డగా ఉంది.

శివసేన అసమ్మతి నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి తొలగించి, జూన్ లో బీజేపీతో కలిసిపోయిన తరువాత రాష్ట్రంలో ఈ కీలక పోటీ నెలకొంది, ఈ ఎన్నికల్లో నాగ్‌పూర్ మండల్ టీచర్ సీటులో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి చెందిన సుధాకర్ అడ్బాలే విజయం సాధించారు. అక్కడి నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి నాగో గనార్ ఓడిపోయారు. 

అయితే కొంకణ్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎంవీఏ మద్దతుగల అభ్యర్థి బలరాం పాటిల్‌ ఓడిపోయారు. ఏక్‌నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి జ్ఞానేశ్వర్ మహాత్రే విజయం సాధించారు. మహాత్రేకు 20,683 ఓట్లు రాగా, పాటిల్‌కు 10,997 ఓట్లు వచ్చాయని కొంకణ్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఫలితాలను ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, డివిజనల్‌ కమిషనర్‌ మహేంద్ర కల్యాణ్‌కర్‌ తెలిపారు.

తాను విజయం సాధించడంలో సహకరించిన ఓటర్లకు, బీజేపీ- బాలాసాహెబ్ శివసేన నాయకులకు జ్ఞానేశ్వర్ మహాత్రే ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. అయితే పీడబ్ల్యూపీ-ఎంవీఏ అభ్యర్థి పాటిల్ మాట్లాడుతూ.. ప్రజల ఎంపిక పూర్తిగా ఆమోదయోగ్యమైనదని, విజయం సాధించినందుకు మహాత్రే కు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘం కోసం మున్ముందు కూడా కృషి చేస్తానన్నారు.

కాగా.. ఐదుగురు కౌన్సిల్ సభ్యుల (ముగ్గురు ఉపాధ్యాయుల నియోజకవర్గాలు, ఇద్దరు పట్టభద్రుల నియోజకవర్గాల నుండి) ఆరేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 7తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలను నిర్వహించింది. కొంకణ్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో అత్యధికంగా 91.02 శాతం ఓటింగ్ నమోదైంది. నాసిక్ డివిజన్ గ్రాడ్యుయేట్ సీటులో అత్యల్పంగా 49.28 శాతం పోలింగ్ నమోదైంది. ఔరంగాబాద్‌, నాగ్‌పూర్‌, కొంకణ్‌ డివిజన్లలోని ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వరుసగా 86 శాతం, 86.23 శాతం, 91.02 శాతం ఓటింగ్‌ నమోదైంది.
 

click me!