హత్రస్ కేసును కూడా వాదించనున్న నిర్భయ న్యాయవాది

By team teluguFirst Published Oct 2, 2020, 2:35 PM IST
Highlights

దేశంలో సంచలనంగా మారిన హత్రాస్ ఉదంతంలో కూడా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు నిర్భయ కేసు లాయర్ సీమా కుష్వాహా మరోసారి వాదించబోతున్నట్టు సమాచారం.

నిర్భయ దోషులకు శిక్ష పడడంలో ఆ కేసు వాదించిన లాయర్ సీమా కుష్వాహా ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే! బెదిరింపులు, అవమానాలు అన్నిటిని ఎదుర్కొంటు.... బాధితురాలికి అన్యాయం చేసిన వారిని ఉరికంబం ఎక్కించింది ఈ ధీర మహిళ. 

దేశంలో సంచలనంగా మారిన హత్రాస్ ఉదంతంలో కూడా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు నిర్భయ కేసు లాయర్ సీమా కుష్వాహా మరోసారి వాదించబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆమె హత్రాస్ బాధితురాలిని కలిసేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. 

ఆమె మాత్రం బాధితురాలి కుటుంబాన్ని కలవకుండా, వెళ్ళేది లేదు అని చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయమని కోరారని, అందుకోసమే తాను వారిని కలవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆమె వాపోయారు. బాధితురాలి సోదరుడితో తాను ప్రస్తుతానికి సంప్రదింపులు జరుపుతున్నానని ఆమె తెలిపారు. 

2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై అత్యంత పాశవికమైన నిర్భయ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేందుకు పోరాడి గెలిచింది. ఇప్పుడు ఈ కేసులో కూడా ఆమె వాదించేందుకు సిద్ధపడింది. 

ఇక హత్రాస్ లో జరిగిన ఘటనలో నలుగురు యువకులు 19 సంవత్సరాల యువతిపై అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఆ యువతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

దీనిపై యూపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. నలుగురు యువకులను అరెస్ట్ చేశామని, కానీ  అత్యాచారం జరిగినట్టు విచారణలో నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. 

ఇకపోతే... ఆసుపత్రి నుండి మృతదేహాన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని కడసారి చూపకుండానే అంత్యక్రియలు నిర్వహించడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి తండ్రితో సీఎం యోగి మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన సీఎం ను కోరారు. మరణించిన కుటుంబానికి సహాయం అందించాలని సీఎం ఆదేశించారని యూపీ హొం మంత్రి తెలిపారు.

click me!