‘‘ఫేక్ ఎన్‌కౌంటర్’’ .. సమర్ధుడిగా గుర్తింపు పొందాలని స్కెచ్: వాజే కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

By Siva KodatiFirst Published Apr 14, 2021, 4:42 PM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారుబాంబు నిలిపిన కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఎన్ఐఏ అధికారులు తవ్వేకొద్ది ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారుబాంబు నిలిపిన కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఎన్ఐఏ అధికారులు తవ్వేకొద్ది ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

ఈ కేసులో కీలక నిందితుడు, ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే... ఇద్దరు వ్యక్తులను ‘‘నకిలీ ఎన్‌‌కౌంటర్’’ చేసి, కారుబాంబు నెపాన్ని వారిమీదికి నెట్టేందుకు పథకం రచించినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో ‘‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’’గా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ వాజే.. ఈ విధంగా కారుబాంబు కేసును ఛేదించినట్టు చెప్పుకోవాలనుకున్నారనీ.. కానీ అది ఫలించలేదని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.

థానే సమీపంలోని వాజే ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఆ పాస్‌పోర్టులో ఉన్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ‘‘ఫేక్ ఎన్‌కౌంటర్‌’’లో హతమార్చాలని వాజే ప్రయత్నించినట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది.

Also Read:ఆ కారు కేసును వదిలేయండి: వికోర్లి పోలీసులకు సచిన్ వాజే ఫోన్

వాస్తవానికి గతేడాది నవంబర్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దొంగిలించిన మారుతీ ఎకో కారులోనే ఈ ‘‘నకిలీ ఎన్‌కౌంటర్’’ ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ భావిస్తోంది. ఆ ఇద్దరు వ్యక్తులను చంపేసి, కారు బాంబు కేసు పరిష్కరించినట్టు చూపించి, ప్రశంసలు అందుకోవాలని వాజే స్కెచ్ వేశాడు.

ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో నింపిన ఎస్‌యూవీ కారు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ కారు యజమాని, వ్యాపారి మన్సుక్ హీరేన్ సైతం మార్చి 5న ఓ కాలవలో శవమై తేలారు.

ఈ రెండు కేసుల్లో విచారణ చేపట్టిన ఎన్ఐఏ గత నెల 13న అనూహ్యంగా సచిన్ వాజేను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కేసు తెరపైకి రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ నుంచి తనను రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా అనిల్ ఆదేశించినట్లు సచిన్ వాజే చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ముంబై నగర మాజీ పోలీస్ కమీషనర్ పరంబీర్ సింగ్ సైతం ఇదే రకమైన ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం రేపాయి. 

click me!