ఉగ్రవాదులు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య సంబంధాలపై టార్గెట్.. పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

By Sumanth KanukulaFirst Published Oct 18, 2022, 11:10 AM IST
Highlights

దేశంతో పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలోని పలు ప్రాంతాలలో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. 
 

దేశంతో పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారతదేశం, విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల మధ్య ఏర్పడుతున్న బంధాలను అరికట్టేందుకు ఎన్‌ఐఏ ఈ  సోదాలు నిర్వహిస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలోని పలు ప్రాంతాలలో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. అంతకు ముందు సెప్టెంబరు 12న పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలలోని 50 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఇలాంటి సోదాలు నిర్వహించింది.

ఈ ఏడాది ఆగస్టు 26న ఢిల్లీ పోలీసులు గతంలో నమోదు చేసిన రెండు కేసులను తిరిగి నమోదు చేసింది. తర్వాత గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపుల మధ్య సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇటువంటి నేరాలకు పాల్పుడుతున్న ముఠా నాయకులు, వారి సహచరులను (భారతదేశం, విదేశాలలో ఉన్నవారు) గుర్తించి కేసులు నమోదు చేశారు. 

ఇదిలా ఉంటే.. గత తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి 191 డ్రోన్‌లు అక్రమంగా ప్రవేశించడాన్ని భద్రతా దళాలు గమనించినట్టుగా తెలుస్తోంది. ఇందులో 171 పంజాబ్ సరిహద్దుల వద్ద, 20 జమ్మూ కశ్మీర్ సరిహద్దు వద్ద గుర్తించారు. ఈ పరిణామాలు దేశంలో అంతర్గత భద్రత పరంగా పెద్ద ఆందోళనలను రేకెత్తించింది. అక్టోబర్ 14న డ్రోన్ డెలివరీ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఎన్‌ఐఏ ప్రకారం.. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లో పాకిస్థాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దులో భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళాలు సోమవారం రాత్రి కూల్చివేశాయి. అమృత్‌సర్‌లోని ఛనా గ్రామ సమీపంలో రాత్రి 8.30 గంటలకు పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న దళాలకు డ్రోన్ (క్వాడ్-కాప్టర్ DJI మ్యాట్రిస్) కనిపించిందని సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. వెంటనే కాల్పులు జరిపి దానిని కూల్చివేశారని చెప్పారు. డ్రోన్ ద్వారా సరఫరా చేసేందుకు యత్నించిన  2.5 కేజీల రెండు ప్యాకెట్ల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

click me!