Coronavirus: భారత్ లో కరోనా వైరస్ సబ్ వేరియంట్ బిక్యూ.1 ను గుర్తించారు. ఈ క్రమంలోనే రోగులను ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. అధిక ప్రమాదం వున్న రోగులు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
omicron subvariant BQ.1: దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా నమోదుకానప్పటికీ.. కొత్త వేరియంట్ల ఆందోళన మొదలైంది. ఎందుకంటే తాజాగా దేశంలో మరో కొత్త వేరియంట్ ను పరిశోధకులు గుర్తించారు. దీని ప్రభావాన్ని అంచని వేసిన వైద్య నిపుణులు అధిక ప్రమాదం ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
వివరాల్లోకెళ్తే.. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో గుర్తించిన అతి ప్రమాదకరైనదిగా పేర్కొన్న కరోనా సబ్ వేరియంట్ బీక్యూ.1, బిక్యూ.1.1 వేరియంట్లను భారత్ లో కూగా గుర్తించారు. అయితే, ఇప్పటివరకు దేశంలో చాలా వేరియంట్లు వెలుగులోకి వచ్చినా పెద్దగా ప్రమాదం చూపలేదు. కానీ ఇప్పుడు గుర్తించిన ఈ వేరియంట్లు అతి ప్రమాదరమైనవి... ఎందుకంటే, అమెరికాలోని యాక్టివ్ కేసుల్లో 10 శాతానికి పైగా ఈ వేరియంట్లకు చెందినవి కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఈ కొత్త వేరియంట్లను గుర్తించారు. కరోనా సోకిన పూణే నివాసి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ సమయంలో భారతదేశంలో మొట్టమొదటి ఓమిక్రాన్ కోవిడ్-19 సబ్‌వేరియంట్ BQ.1 కేసు కనుగొనబడిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రదీప్ అవతే డిటెక్షన్‌ను ఉదహరించారు. అధిక ప్రమాదం ఉన్న రోగులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సబ్ వేరియంట్లు BQ.1, BQ.1.1 అనేవి ఓమిక్రాన్ BA.5 సబ్‌వేరియంట్ కు చెందినవి. ఇవి రెండూ ప్రమాదకరమైనవిగా వర్ణించబడ్డాయి. అవి కోవిడ్-19కి వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న రక్షణను తప్పించుకోగలవు.
undefined
యూఎస్ లో యాక్టివ్ కేసులన్నింటిలో 10 శాతానికి పైగా ఇవి కారణమయ్యాయి. అక్టోబర్ 16తో ముగిసిన వారంలో మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు 17.7 శాతం పెరిగాయి. సోమవారం, రాష్ట్రంలో 201 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరణాల రేటు 1.82 శాతంగా ఉంది. పూణేలో కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల ప్రస్తుతం థానే, రాయ్‌గఢ్, ముంబయికి పరిమితమైందని అవతే చెప్పారు. ముఖ్యంగా పండుగల సమయంలో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. "... మనం గమనించాలి... జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న రోగులకు కొత్త వేరియంట్లు విషయంలో జాగ్రత్తలు అవసరం. ఫ్లూ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోండి. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించండి" అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. “కొమొర్బిడిటీలు ఉన్న వ్యక్తులు బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూ లాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వీలైనంత వరకు పబ్లిక్ కాంటాక్ట్‌కు దూరంగా ఉండాలి" అని చెప్పారు.
కాగా, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,542 కొత్త కరోనావైరస్ కేసులు, 8 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి ప్రారంభం నుండి దేశంలో మొత్తం కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,46,32,430కి చేరుకుంది. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, మునుపటి రోజుతో పోలిస్తే 385 కేసులు తగ్గడంతో, భారతదేశం క్రియాశీల కాసేలోడ్ 26,449కి తగ్గింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.06 శాతం ఉన్నాయి. కొత్తగా సంభవించిన కోవిడ్-19 మరణాల్లో గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు, కేరళలో ఐదు మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం మరణాల సంఖ్య ఇప్పుడు 5,28,913 కు చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,77,068కి పెరిగింది.